ఆపరేషన్ ముస్కాన్ విజయవంతం.. 278 మంది బాలలు సురక్షితం
Operation Muskaan:ఆపరేషన్ ముస్కాన్–XII విజయవంతమైంది. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనతో పాటు తప్పిపోయిన, వదిలివేసిన పిల్లలను గుర్తించి రక్షించే ఈ ప్రత్యేక కార్యక్రమంలో వందలాది మంది బాలబాలికలను గుర్తించారు. రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలోని పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాలో ప్రత్యేక బృందాలు ఈ పనిని విజయవంతం చేశాయి.
బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన, పిల్లల భద్రతే ఆపరేషన్ ముస్కాన్ ప్రధాన లక్ష్యమని రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా(Ramagundam Police Commissioner Amber Kishore Jha) తెలిపారు. ప్రతి సంవత్సరం రెండుసార్లు నిర్వహించే ఆపరేషన్ స్మైల్, ఆపరేషన్ ముస్కాన్ కార్యక్రమాల ద్వారా తప్పిపోయిన, వదిలివేసిన పిల్లలను గుర్తించి వారి కుటుంబాలకు అప్పగించడం… అవసరమైతే బాలల సంరక్షణ గృహాలకు తరలిస్తున్నట్లు వెల్లడించారు.
జూలై 1 నుంచి 31 వరకు నిర్వహించిన ఆపరేషన్ ముస్కాన్–XIIలో పెద్దపల్లి, మంచిర్యాల జిల్లాల్లోని పోలీసు శాఖ, చైల్డ్ వెల్ఫేర్ కమిటీ, కార్మిక, విద్య, బాలల సంరక్షణ, వైద్య ఆరోగ్య శాఖల సమన్వయంతో విస్తృత తనిఖీలు చేపట్టారు. ప్రతి డివిజన్‌కు ప్రత్యేక పోలీసు బృందాలను ఏర్పాటు చేసి, స్వచ్ఛంద సంస్థల సహకారంతో హోటళ్లు, మెకానిక్ షాపులు, పరిశ్రమలు, వ్యాపార సంస్థలు, కిరాణా దుకాణాలు తదితర ప్రాంతాల్లో తనిఖీలు నిర్వహించారు.
ఈ ఆపరేషన్‌లో కమిషనరేట్ వ్యాప్తంగా మొత్తం 278 మంది బాలబాలికలను గుర్తించి రక్షించారు. పెద్దపల్లి జిల్లాలో 151 మంది, మంచిర్యాల జిల్లాలో 127 మంది బాలలను గుర్తించారు. బాల కార్మికులను నియమించిన వారిపై పెద్దపల్లిలో 11 కేసులు నమోదు చేసి 12 మందిని, మంచిర్యాలలో ఆరు కేసులు నమోదు చేసి ఏడుగురిని అరెస్టు చేసినట్లు పోలీస్ కమిషనర్ వెల్లడించారు.