ప్రాణం ఉన్నంత వ‌ర‌కు ప్రేమ్‌సాగర్‌రావుతోనే…

మంచిర్యాల ఎమ్మెల్యే కొక్కిరాల ప్రేమ్‌సాగర్‌రావును తాము వీడుతున్నామని, తమలో అసంతృప్తి ఉందంటూ జరుగుతున్న ప్రచారాలను మంచిర్యాల మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్పొరేటర్లు ఖండించారు. ఎమ్మెల్యే నివాసంలో మున్సిపల్ కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు, కార్పొరేటర్ తూముల నరేష్ అధ్యక్షతన నిర్వహించిన పాత్రికేయుల సమావేశంలో మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య-మహేష్, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులు పూదరి తిరుపతితో పాటు పలువురు కార్పొరేటర్లు పాల్గొన్నారు.

ఈ సందర్భంగా మేయర్ ధర్ని మధుకర్, డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేషన్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు తూముల నరేష్, కార్పొరేటర్లు బండారి సుధాకర్, తాళ్ల సంపత్‌రెడ్డి మాట్లాడుతూ.. తాము ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును విడిచి వెళ్తామని జరుగుతున్న ప్రచారాల్లో ఎలాంటి నిజం లేదన్నారు. తమ మధ్య అసంతృప్తి ఉందంటూ తప్పుడు ప్రచారాలు చేయడం సరికాదని పేర్కొన్నారు.

ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావును విడిచి వెళ్లే ప్రసక్తే లేదని స్పష్టం చేశారు. ప్రాణం ఉన్నంత వరకు ఎమ్మెల్యే ప్రేమ్‌సాగర్‌రావుతోనే కలిసి పనిచేస్తామని తెలిపారు. ఎవరు ఎన్ని తప్పుడు ప్రచారాలు చేసినా మంచిర్యాల నియోజకవర్గ ప్రజలు వాటిని నమ్మరని అన్నారు. ఎమ్మెల్యే నాయకత్వంలో కాంగ్రెస్ పార్టీ బలోపేతానికి, నియోజకవర్గ అభివృద్ధికి కట్టుబడి పనిచేస్తామని స్పష్టం చేశారు.

You might also like