జిల్లాల్లో ఆర్మీ ట్రైనింగ్ సెంటర్లు..
Army training centers in the districts:ఆర్మీలో చేరి దేశానికి సేవ చేయాలన్నది ఎంతోమంది యువత కల.. కానీ ఆర్మీ నియామక ప్రక్రియపై సరైన అవగాహన, శారీరక శిక్షణ లేక చాలామంది అవకాశాన్ని కోల్పోతున్నారు. ఇకపై అలాంటి పరిస్థితి ఉండకూడదనే ఉద్దేశంతో తెలంగాణ ప్రభుత్వం(Government of Telangana) కీలక అడుగు వేసింది. యువతకు ఆర్మీ ఉద్యోగాలపై అవగాహన కల్పించడంతో పాటు.. నియామకానికి అవసరమైన శిక్షణను జిల్లాల్లోనే అందించేలా ప్రత్యేక ట్రైనింగ్ సెంటర్ల ఏర్పాటుకు శ్రీకారం చుట్టింది.
తెలంగాణ యువతకు ఆర్మీ ఉద్యోగాలపై రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. యువతను భారత సైన్యంలో చేరేలా ప్రోత్సహించేందుకు.. జిల్లాల్లోనే ప్రత్యేక శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని ప్రభుత్వం ప్రతిపాదించింది. ఆర్మీ నియామక ప్రక్రియ, అర్హతలు, శారీరక శిక్షణపై గ్రామీణ ప్రాంత యువతకు ముందుగానే అవగాహన కల్పించడమే లక్ష్యంగా ఈ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.
తెలంగాణ యువతను భారత సైన్యంలో చేరేలా ప్రోత్సహించేందుకు రాష్ట్ర ప్రభుత్వం, భారత సైన్యం కలిసి పనిచేయనున్నాయి. ఆర్మీ రిక్రూట్‌మెంట్‌పై గ్రామీణ, జిల్లా స్థాయి యువతలో అవగాహన పెంచేందుకు ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు నిర్వహించాలని సీఎం రేవంత్ రెడ్డి(CM Revanth Reddy) సూచించారు. ఈ మేరకు దక్షిణ కమాండ్ జనరల్ ఆఫీసర్ కమాండింగ్ ఇన్ చీఫ్ లెఫ్టినెంట్ జనరల్ సి. రాజేష్ పుష్కర్.. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని కలిశారు. ఆర్మీ నియామకాలతో పాటు పలు అంశాలపై ఇరువురూ చర్చించారు.
దేశవ్యాప్తంగా జరగనున్న ఆర్మీ నియామక కార్యక్రమాలకు ముందే.. తెలంగాణలోని ఎంపిక చేసిన జిల్లా కేంద్రాల్లో యువత కోసం శిక్షణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని సీఎం కోరారు. ముఖ్యమంత్రి ప్రతిపాదనకు లెఫ్టినెంట్ జనరల్ రాజేష్ పుష్కర్ సానుకూలంగా స్పందించినట్లు ముఖ్యమంత్రి కార్యాలయం తెలిపింది.
రాష్ట్రంలోని వివిధ జిల్లా కేంద్రాల్లో యువతకు శిక్షణ అందించే కేంద్రాలను ఏర్పాటు చేసేందుకు సైన్యం సిద్ధంగా ఉందని ఆయన వెల్లడించినట్లు పేర్కొంది. ఈ శిక్షణ కేంద్రాల ద్వారా ఆర్మీ నియామక ప్రక్రియ, అర్హతలు, శారీరక సామర్థ్య పరీక్షలు, శిక్షణ విధానంపై యువతకు ముందుగానే అవగాహన కల్పించే అవకాశం ఏర్పడనుంది.
జిల్లా కేంద్రాల్లోనే శిక్షణ అందుబాటులోకి వస్తే.. గ్రామీణ ప్రాంత యువతకు ఇది మరింత ఉపయోగకరంగా మారనుంది. ఆర్మీలో చేరాలనుకునే తెలంగాణ యువతకు జిల్లాల్లోనే శిక్షణ అందించేందుకు ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం.. రాబోయే ఆర్మీ నియామకాల్లో యువతకు మరింత ప్రయోజనం కలిగించే అవకాశం ఉంది.