తెలంగాణ రాష్ట్ర కేబినెట్ కీలక నిర్ణయాలు ఇవే..

స్మార్ట్ రేషన్ కార్డుల నుంచి రూ.2,100 కోట్ల ఎత్తిపోతల వరకు

రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డుల పంపిణీ
తెలంగాణ రైజింగ్ గ్లోబల్ సమ్మిట్ 2.0కు ఆమోదం
ఏడు రకాల సన్నాలకు రూ.500 బోనస్
మిగులు ధాన్యాన్ని ఈ-ఆక్షన్‌లో విక్రయం
ITIలు, ATCలు, పాలిటెక్నిక్‌లను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ పరిధిలోకి
మరో 7 యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్లకు అనుమతి
హైదరాబాద్‌లో పెట్రోల్, డీజిల్ ఆటోలను EVలుగా మార్చేందుకు రూ.200 కోట్ల పథకం
HILT పాలసీ దరఖాస్తుల గడువు అక్టోబర్ 31 వరకు పొడిగింపు
మక్తల్–నారాయణపేట–కొడంగల్ ఎత్తిపోతల ఫేజ్-2కు రూ.2,100 కోట్లు
గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ సామర్థ్యం 15 టీఎంసీలకు పెంపు

Telangana Cabinet: తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి అధ్యక్షతన జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశం ముగిసింది. రాష్ట్ర సచివాలయంలో దాదాపు మూడు గంటలపాటు సుదీర్ఘంగా సాగిన ఈ సమావేశంలో రాష్ట్ర అభివృద్ధి, పెట్టుబడులే లక్ష్యంగా పలు కీలక నిర్ణయాలు తీసుకున్నారు. ముఖ్యంగా, గత ఏడాది కంటే అత్యంత ఘనంగా ‘తెలంగాణ గ్లోబల్‌ సమ్మిట్‌ 2.0’ను నిర్వహించాలని మంత్రివర్గం ఏకగ్రీవంగా నిర్ణయించింది. రాబోయే డిసెంబర్‌ 7, 8, 9 తేదీల్లో మూడు రోజుల పాటు ఈ గ్లోబల్ సమ్మిట్‌ను నిర్వహించనున్నారు.

• రేపు స్వాతంత్య్ర‌ దినోత్సవ వేడుకల సందర్భంగా రాష్ట్రంలో రేషన్ కార్డుదారులకు స్మార్ట్ కార్డులను పంపిణీ కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించాలని మంత్రివర్గం నిర్ణయించింది. అందుకు సంబంధించి అన్ని జిల్లాల్లో ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించింది. గతంలో రాష్ట్రంలో 2 కోట్ల 81 లక్షల మంది రేషన్ కార్డు లబ్ధిదారులుంటే.. ప్రజా ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కొత్త రేషన్ కార్డులు జారీ చేసింది. కొత్తగా కుటుంబీకుల పేర్లను కూడా నమోదు చేసింది. 62 లక్షల మందికి కొత్తగా లబ్ధి చేకూర్చింది. రాష్ట్రంలో ఈరోజుకు మొత్తం 3 కోట్ల 42 లక్షల మంది రేషన్ లబ్ధిదారులున్నారు. వీరికి స్మార్ట్ కార్డుల జారీకి ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసింది.

• వానాకాలం పంట‌కు సంబంధించి ఏడు ర‌కాల స‌న్న ధాన్యం సాగు ప్రోత్సహించి, ఆ ఏడు ర‌కాల సాగును పెంచడానికి రైతుల‌కు అవ‌గాహ‌న క‌ల్పించాలని కేబినేట్ నిర్ణయించింది. రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీ భవనాలు, రైతు వేదిక‌ల ద్వారా విస్తృత ప్రచారం చేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ ఏడాది నుంచి ఈ ఏడు ర‌కాల స‌న్నాల‌కే రూ.500 బోన‌స్‌ చెల్లించాల‌ని కేబినేట్ తీర్మానించింది.

• యాసంగి ధాన్యం సేకరణలో తెలంగాణ దేశంలోనే నెంబర్ వన్ గా నిలిచింది. గతంలో ఎన్నడూ లేని విధంగా ఈసారి 81.16 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని రైతులకు కనీస మద్ధతు ధర చెల్లించి ప్రభుత్వం కొనుగోలు చేసింది. అందులో 63.62 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని మాత్రమే కేంద్ర ప్రభుత్వం సేకరిస్తుంది. మిగతా 17.54 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని ఈ వేలం ద్వారా విక్రయించేందుకు కేబినేట్ ఆమోదం తెలిపింది. ఇటీవల మొక్కజొన్న వేలంతో రాష్ట్ర ప్రభుత్వం ఆదాయం రాబ‌ట్టుకున్న నేప‌థ్యంలో ఈ మిగులు ధాన్యానికి కూడా క్వింటాలుకు రూ.2389 బేసిక్ ప్రైస్ నిర్ణయించి.. ఈ వేలం (e-Auction) ద్వారా ధాన్యం అమ్మాలని కేబినేట్ నిర్ణయించింది.

• రాష్ట్రంలోని ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ కాలేజీలను యంగ్ ఇండియా స్కిల్స్ యూనివ‌ర్సిటీ ప‌రిధిలోకి తీసుకురావ‌డానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ప్రస్తుతం ఐటీఐలు, ఏటీసీలు, పాలిటెక్నిక్ క‌ళాశాల‌లు సాంకేతిక విద్యా శాఖ ప‌రిధిలో ఉన్నాయి. వీటిని తెలంగాణ ఎడ్యుకేష‌న్ యాక్ట్ నుంచి తొల‌గించి యంగ్ ఇండియా స్కిల్స్ యూనివర్సిటీ (YISU) పరిధిలో చేర్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ప్రస్తుతం పరిశ్రమల శాఖ పరిధిలో ఉన్న వీటన్నింటినీ ఇకపై శక్తి శాఖ పరిధిలోకి విలీనం చేసేందుకు క్యాబినెట్ తీర్మానించింది.

• ఆదిలాబాద్‌, నిర్మల్, ముధోల్‌, బోథ్‌, సిర్పూర్‌, గజ్వేల్, దుబ్బాక నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ స్కూళ్ల నిర్మాణానికి రాష్ట్ర మంత్రివర్గం ఆమోదం తెలిపింది. రాష్ట్రంలో తొలివిడ‌త‌గా 113 నియోజ‌క‌వ‌ర్గాల్లో యంగ్ ఇండియా ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియ‌ల్స్ స్కూల్ కాంప్లెక్స్లో నిర్మించాల‌ని రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. ఈరోజు కొత్తగా ఆమోదించిన 7 స్కూళ్లతో కలిపి ఇప్పటివరకు 86 యంగ్ ఇండియా రెసిడెన్సియల్ స్కూల్ కాంప్లెక్స్ లకు అనుమతులు మంజూరయ్యాయి. ఇప్పటికే నిర్మాణంలో ఉన్న యంగ్ ఇండియా ఇంటిగ్రేటేడ్ స్కూళ్లను వీలైనంత వేగంగా పూర్తి చేయాలని ముఖ్యమంత్రి ఆదేశించారు.

• హైదరాబాద్ ను గ్రీన్ సిటీగా మార్చేందుకు రాష్ట్ర మంత్రివర్గం మరో కీలక నిర్ణయం తీసుకుంది. హైదరాబాద్లో ప్రస్తుతం 18,766 పెట్రోల్, డీజిల్ ఆటోరిక్షాలున్నాయి. వీటిని ఈవీ (విద్యుత్తు వాహనాలుగా) మార్చేందుకు రూ.200 కోట్లతో ప్రత్యేక పథకం (తెలంగాణ ఆటో రిక్షా ఎలక్ట్రిక్ కన్వర్షన్ స్కీమ్) అమలుకు రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. ఈ పథకం కింద అర్హులైన ఆటో డ్రైవర్లకు ఒక్కో వాహనానికి గరిష్ఠంగా రూ.1 లక్ష 50 వేలు సబ్సిడీ అందిస్తారు. ప్రస్తుతం ఉన్న ఆటోకు విద్యుత్ కిట్ అమర్చుకోవటం లేదా పాత వాహనాన్ని స్క్రాప్ చేసి కొత్త విద్యుత్ ఆటో కొనుగోలు చేసుకునేందుకు ఈ పథకం ద్వారా అవకాశం కల్పించనున్నారు.

• హైదరాబాద్ సిటీ పరిధిలో ఉన్న కాలుష్య కారక పరిశ్రమలను సిటీ శివార్లకు తరలించేందుకు ఉద్దేశించిన HILT పాలసీ దరఖాస్తుల గడువును మరో 3 నెలలు పొడిగించేందుకు కేబినెట్ నిర్ణయం. దరఖాస్తుదారుల విజ్ఞప్తుల మేరకు అక్టోబర్ 31 వరకు అప్లై చేసుకునేందుకు అవకాశం కల్పించింది.

• మక్తల్-నారాయణపేట-కొడంగల్ ఎత్తిపోత‌ల ఫేజ్‌-II పనుల కోసం రూ. 2,100 కోట్ల అంచనా వ్యయానికి రాష్ట్ర క్యాబినెట్ ఆమోదం తెలిపింది. దీంతో దాదాపు ల‌క్ష ఎక‌రాల‌కు సాగు నీరు, ఆ ప్రాంతంలో తాగు నీరు, పారిశ్రామిక అవ‌స‌రాల‌కు ఈ ఎత్తిపోత‌ల నుంచి అందుతుంది.

• గూడెం దొడ్డి పంప్డ్ స్టోరేజీ ప్రాజెక్టు సామ‌ర్థ్యాన్ని 1.19 టీఎంసీ నుంచి 15 టీఎంసీల‌కు పెంచటంతో పాటు సోలార్ విద్యుత్ ఉత్పత్తిపై అధ్యయనం చేసేందుకు కన్సల్టెంట్ ను నియామకానికి క్యాబినెట్ ఆమోదం తెలిపింది.

You might also like