నిర్లక్ష్యం సహించేది లేదు
కలెక్టర్ కే. హరిత
కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లా జైనూర్ కేజీబీవీ హాస్టల్ ను కలెక్టర్ కే. హరిత ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా హాస్టల్లోని తరగతి గదులు, వంటగది మరియు పరిసరాలను స్వయంగా పరిశీలించిన కలెక్టర్, విద్యార్థులకు అందుతున్న సౌకర్యాలను అడిగి తెలుసుకున్నారు. తనిఖీ అనంతరం కలెక్టర్ విద్యార్థులతో కలిసి అల్పాహారం స్వీకరించారు. ఆహార నాణ్యతపై సంతృప్తి వ్యక్తం చేసిన అనంతరం అధికారులకు, హాస్టల్ సిబ్బందికి పలు కీలక ఆదేశాలు జారీ చేశారు
ప్రభుత్వం నిర్దేశించిన మెనూ ప్రకారం రోజూ విద్యార్థులకు నాణ్యమైన, పౌష్టికాహారాన్ని మాత్రమే అందించాలని స్పష్టం చేశారు. ఆహారం విషయంలో ఎలాంటి నిర్లక్ష్యాన్ని సహించేది లేదని హెచ్చరించారు. హాస్టల్ ప్రాంగణంతో పాటు వంటగది, పరిశుభ్రత విషయంలో ప్రత్యేక శ్రద్ధ వహించాలని సూచించారు. ఈ సందర్భంగా విద్యార్థుల భవిష్యత్తు, ఉన్నత చదువులపై ప్రత్యేకంగా మాట్లాడారు.
లక్ష్యాలను ఎంచుకుని, వాటిని సాధించేందుకు క్రమశిక్షణతో చదవాలని సూచించారు. పదవ తరగతి, ఇంటర్ విద్యార్థులకు కెరీర్ గైడెన్స్‌పై పలు సలహాలు, విలువైన మార్గదర్శకాలను అందించారు.
ఈ కార్యక్రమంలో కేజీబీవీ ఉపాధ్యాయులు, హాస్టల్ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.