గురుకుల పాఠశాలల్లో ఖాళీల భర్తీ

తెలంగాణ సాంఘిక సంక్షేమ గురుకుల విద్యాలయాల సంస్థ ఆధ్వర్యంలో జిల్లా పరిధిలో నిర్వహిస్తున్న 9 గురుకుల పాఠశాలల్లో 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఏర్పడే ఖాళీలను భర్తీ చేసేందుకు ఈ నెల 20న స్పాట్ అడ్మిషన్ కౌన్సెలింగ్, సెలక్షన్స్ నిర్వహించనున్నట్లు జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ తెలిపారు.

జిల్లాలోని 5 బాలుర, 4 బాలికల గురుకుల పాఠశాలల్లో వివిధ కమ్యూనిటీ, క్యాస్ట్ కేటగిరీల వారీగా అందుబాటులో ఉండే ఖాళీల ఆధారంగా స్పాట్ అడ్మిషన్లు చేపడతామని కలెక్టర్ వెల్లడించారు. VTG CET/BLV CET–2026 ప్రవేశ పరీక్షకు హాజరైన బాలబాలికలు మాత్రమే ఈ అడ్మిషన్లకు దరఖాస్తు చేసుకునేందుకు అర్హులని తెలిపారు. ఆర్ఫన్, సెమీ-ఆర్ఫన్ విద్యార్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పించనున్నట్లు పేర్కొన్నారు.

అర్హులైన విద్యార్థులు ఈ నెల 20న ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటలలోపు నస్పూర్‌లోని సమీకృత జిల్లా కార్యాలయాల భవన సముదాయంలో స్వయంగా హాజరై దరఖాస్తు చేసుకోవాలని సూచించారు. మధ్యాహ్నం 2 గంటల తర్వాత మెరిట్ జాబితాను రూపొందించి, నిబంధనల ప్రకారం 9 గురుకుల పాఠశాలల్లోని 5వ తరగతి నుంచి 9వ తరగతి వరకు ఖాళీలను భర్తీ చేస్తామని తెలిపారు.

ముందుగా సంబంధిత కమ్యూనిటీకి చెందిన ఆర్ఫన్, సెమీ-ఆర్ఫన్ విద్యార్థులకు ప్రాధాన్యత ఇచ్చిన అనంతరం మిగిలిన ఖాళీలను VTG CET/BLV CET–2026 ర్యాంక్ కార్డులోని మెరిట్ క్రమం ఆధారంగా భర్తీ చేస్తామని కలెక్టర్ వివరించారు.

అభ్యర్థులు తీసుకురావాల్సిన ధ్రువపత్రాలు:VTG CET/BLV CET–2026 ర్యాంక్ కార్డు, కులం/కమ్యూనిటీ సర్టిఫికెట్, బోనఫైడ్ సర్టిఫికెట్, ఆర్ఫన్/సెమీ-ఆర్ఫన్‌కు సంబంధించిన ధ్రువపత్రాలు, ఇతర సంబంధిత ధ్రువపత్రాలను దరఖాస్తుతో పాటు సమర్పించాలని సూచించారు.

అర్హత, ఆసక్తి కలిగిన బాలబాలికలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ కుమార్ దీపక్ కోరారు.

You might also like