సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సమావేశం
-డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క హామీ
-INTUC ప్రతినిధి బృందంతో భేటీ
Singareni:సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారం, పెండింగ్ హామీల అమలు కోసం INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ ఆధ్వర్యంలో ప్రతినిధి బృందం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్కని కలిసింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికుల సమస్యలను ఆయనకు వివరించింది. ఈ సందర్భంగా సింగరేణి కార్మికులు, ఉద్యోగులు ఎదుర్కొంటున్న పలు కీలక సమస్యలపై భట్టితో నేతలు సమగ్రంగా చర్చించారు.
ముఖ్యంగా , సింగరేణి సంస్థ పరిరక్షణ, కార్మికుల మనుగడ కోసం నూతన బొగ్గు గనుల ప్రారంభం, మెడికల్ బోర్డు సమస్య, మారుపేర్ల మార్పు సమస్య, పెర్క్స్‌పై ఇన్కమ్ ట్యాక్స్ మాఫీ, సొంత ఇంటి కల సాకారం, సింగరేణి లాభాల్లో కార్మికులకు వాటా ప్రకటించడం, అధికారులకు సంబంధించిన PRP సమస్య, అలాగే సింగరేణి యాజమాన్యంతో IR సమావేశం ఏర్పాటు వంటి అంశాలను డిప్యూటీ సీఎంకు వివరించారు. కార్మికులకు ఇచ్చిన హామీలను కాలపరిమితిలోగా అమలు చేయడం, సింగరేణిలో కార్మికుల సంక్షేమానికి సంబంధించిన అంశాలపై ప్రభుత్వం ప్రత్యేక దృష్టి సారించాలని INTUC నాయకులు కోరారు.
INTUC ప్రతినిధి బృందం ప్రస్తావించిన సమస్యలపై సానుకూలంగా స్పందించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క, సింగరేణి కార్మికుల సమస్యల పరిష్కారానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. వీలైనంత త్వరగా INTUC యూనియన్ ప్రతినిధులు, సింగరేణి అధికారులతో ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి, ఒక్కో సమస్యను పరిశీలించి పరిష్కారానికి కృషి చేస్తామని హామీ ఇచ్చారు. సింగరేణి కార్మికుల హక్కులు, పెండింగ్ సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వంతో చర్చిస్తూ, కార్మికులకు న్యాయం జరిగే వరకు కృషి చేస్తామని INTUC సెక్రటరీ జనరల్ జనక్ ప్రసాద్ తెలిపారు.
ఈ సమావేశంలో సెంట్రల్ సీనియర్ వైస్ ప్రెసిడెంట్లు నరసింహ రెడ్డి, ధర్మపురి, త్యాగరాజన్, కాంపెల్లి సమ్మయ్య, చీఫ్ ఆర్గనైజింగ్ సెక్రటరీ నరేందర్, జనరల్ సెక్రటరీ వికాస్ కుమార్ యాదవ్, వైస్ ప్రెసిడెంట్ వడ్డేపల్లి దాస్ పాల్గొన్నారు.