ఒక అడుగు ముందే ఉండాలి..
కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా
నేరస్తుల కంటే ఒక అడుగు ముందుండాలని, నూతన టెక్నాలజీతో నేరాలపై ‘నిఘా’ పెంచాలని కాళేశ్వరం జోన్ డీఐజీ అంబర్ కిశోర్ ఝా(Kaleshwaram Zone DIG Amber Kishore Jha) స్పష్టం చేశారు. ఆయన భూపాలపల్లి జిల్లాలోని కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయాన్ని సమగ్రంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నేరాల నియంత్రణకు టెక్నాలజీనే సరైన ఆయుధమన్నారు.
సీసీటీవీ వ్యవస్థ సమర్థవంతంగా వినియోగించుకోవాలని, నేరాల నియంత్రణతో పాటు ప్రజల భద్రత మరింత బలోపేతం చేయాలని అధికారులకు సూచించారు. ప్రజలకు పారదర్శకమైన, సమర్థవంతమైన, జవాబుదారీతనంతో కూడిన పోలీస్ సేవలు అందించడం ప్రతి పోలీస్ అధికారి బాధ్యత అని పేర్కొన్నారు.
మారుతున్న కాలానికి అనుగుణంగా ఆధునిక సాంకేతిక పరిజ్ఞానాన్ని విస్తృతంగా వినియోగించాలని, ముఖ్యంగా CCTNS 2.0,, e-Sakshya, డిజిటల్ ఫోరెన్సిక్స్,సైబర్ దర్యాప్తు, సోషల్ మీడియా మానిటరింగ్ వంటి అంశాల్లో ప్రతి పోలీస్ అధికారి, సిబ్బంది తమ నైపుణ్యాలను పెంపొందించుకోవాలని సూచించారు. డ్రగ్స్, గంజాయి,సైబర్ నేరాలు,ట్రాఫిక్ నియంత్రణ, రౌడీషీటర్లు, హిస్టరీషీటర్లపై నిరంతర నిఘా కొనసాగించాలని సూచించారు.
కొయ్యూరు పోలీస్ స్టేషన్, మహాదేవపూర్ సర్కిల్ ఇన్స్పెక్టర్ కార్యాలయ ఆవరణలో డీఐజీ అంబర్ కిషోర్ ఝా మొక్కలు నాటారు. ఈ సందర్భంగా భూపాలపల్లి ఎస్పీ సిరిశెట్టి సంకీర్త్(Bhupalapally SP Sirisetty Sankeerth) డీఐజీకి ఘన స్వాగతం పలికారు. కార్యక్రమంలో కాటారం డీఎస్పీ సూర్యనారాయణ, కాటారం సీఐ నాగార్జునరావు, మహాదేవపూర్ సీఐ వెంకటేశ్వర్లు, పోలీస్ అధికారులు, సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.