విధులు నిర్వహిస్తుండగా గుండెపోటు… సింగరేణి కార్మికుడు మృతి
భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1 ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న ఓ సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. భూపాలపల్లి ఏరియాలోని కేటీకే-1ఇంక్లెన్లో విధులు నిర్వహిస్తున్న గోపి అనే సింగరేణి కార్మికుడు గుండెపోటుతో మృతి చెందాడు. కేటీకే-1 ఇంక్లైన్లో కోల్ కట్టర్ గా పనిచేస్తున్న గోపాల గోపి (39) రాత్రి షిఫ్ట్ లో 28 డీప్, 14 లెవెల్లో విధులు నిర్వహిస్తుండగా అకస్మాత్తుగా ఛాతిలో నొప్పి వచ్చింది. దీంతో తోటి కార్మికులు గోపిని గని పైకి తీసుకువచ్చి అంబులెన్స్ లో ఏరియా సింగరేణి ఆస్పత్రికి తరలించారు. అయితే అప్పటికే గోపి మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు.
ఈ ఘటనపై సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యంగా వ్యవహరించిందంటూ కార్మికులు ఆందోళనకు దిగారు.బీఎంఎస్ నాయకులు ఆస్పత్రి వద్దకు చేరుకుని నిరసన చేపట్టారు. ఈ సందర్భంగా బీఎంఎస్ రాష్ట్ర అధ్యక్షుడు అప్పాని శ్రీనివాస్ మాట్లాడుతూ.. గనిలో కార్మికుడికి ఛాతిలో నొప్పి వచ్చిన సమయంలో అధికారులు కనీసం సీపీఆర్ చేసే ప్రయత్నం చేయలేదని ఆరోపించారు. కనీసం ఆక్సిజన్ కూడా అందించలేదని మండిపడ్డారు. అంబులెన్స్ లో కేవలం ఒక కార్మికుడిని మాత్రమే తోడుగా పంపించడం ఏమిటని ప్రశ్నించారు. ఆస్పత్రికి తరలించిన అనంతరం కూడా వైద్యులు సీపీఆర్ చేసే ప్రయత్నం చేయకుండానే కార్మికుడు మృతి చెందినట్లు నిర్దారించారని ఆరోపించారు. అధికారుల నిర్లక్ష్యం కారణంగానే గోపి ప్రాణాలు కోల్పోయాడని, ఘటనపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు.