బూతుల నేతకు షాక్

కంది శ్రీనివాస్‌రెడ్డి, ఇజ్జగిరి సంజయ్‌కు అధిష్టానం నోటీసులు

ఆదిలాబాద్: జిల్లా కాంగ్రెస్ పార్టీలో అంతర్గత విభేదాలు మరోసారి తెరపైకి వచ్చాయి. ఉట్నూర్‌లో ఇటీవల జరిగిన జిల్లా పీఏసీ సమావేశంలో చోటుచేసుకున్న వివాదంపై పార్టీ అధిష్టానం సీరియస్‌గా స్పందించింది. సమావేశంలో సీనియర్ నేత సంజీవరెడ్డిని ఉద్దేశించి ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నేత కంది శ్రీనివాస్‌రెడ్డి బూతు పురాణం అందుకున్నారు. అనుచిత పదజాలం ఉపయోగించారన్న ఆరోపణలపై క్రమశిక్షణ కమిటీ షోకాజ్ నోటీసు జారీ చేసింది.

సమావేశంలో ఏఐసీసీ కార్యదర్శి సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు సమక్షంలోనే శ్రీనివాస్‌రెడ్డి వర్గీయుల మధ్య వాగ్వాదం జరిగింది. ఈ ఘటనపై పూర్తి వివరణ ఇవ్వాలని, మూడు రోజుల్లోగా సమాధానం ఇవ్వాలని క్రమశిక్షణ కమిటీ జారీ చేసిన షోకాజ్ నోటీసులో పేర్కొన్నారు.

కంది శ్రీనివాస్‌రెడ్డితో పాటు ఇజ్జగిరి సంజయ్ అనే మరో నాయకుడికి కూడా అధిష్టానం షోకాజ్ నోటీసులు జారీ చేసినట్లు పార్టీ వర్గాలు వెల్లడించాయి. సమావేశంలో జరిగిన పరిణామాలపై ఇద్దరూ తమ వివరణను సమర్పించాల్సి ఉంటుంది. వారి సమాధానాలను పరిశీలించిన అనంతరం తదుపరి చర్యలపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది.

ఇప్పటికే ఆదిలాబాద్ కాంగ్రెస్‌లో నేతల మధ్య విభేదాలు బహిరంగంగా వ్యక్తమవుతున్న నేపథ్యంలో తాజాగా షోకాజ్ నోటీసులు జారీ కావడం పార్టీలో చర్చనీయాంశంగా మారింది. సమావేశంలో చోటుచేసుకున్న పరిణామాలపై అధిష్టానం క్రమశిక్షణ చర్యలకు సిద్ధమవుతుండటం స్థానిక కాంగ్రెస్ రాజకీయాల్లో మరింత వేడి పెంచింది.

మూడు రోజుల్లో నేతలు ఇచ్చే వివరణపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందన్నది ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

You might also like