సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ సమస్యలపై సమరశంఖం

- రిజర్వేషన్ల రచ్చ.. కమిషన్‌ ముందుకు సమస్యలు
- సింగరేణిలో బ్యాక్‌లాగ్‌ భర్తీపై కమిషన్‌ ఆరా
- ఉద్యోగులపై వేధింపులు... కమిషన్‌కు ఎస్సీ, ఎస్టీ సంఘాల ఫిర్యాదు

Singareni:సింగ‌రేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులపై పక్షపాత వైఖరితో ఛార్జ్‌షీట్లు, సస్పెన్షన్లు, కంపల్సరీ రిటైర్మెంట్లు వంటి క్రమశిక్షణ చర్యలు తీసుకుంటున్నారని ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్(SC/ST Welfare Association) ప్రతినిధులు ఆరోపించారు. విజిలెన్స్ విచారణల సమయంలో ఉద్యోగులను వేధింపులకు గురిచేస్తూ, ఒత్తిడి తెచ్చి సంతకాలు చేయించుకుంటున్నారని ఆవేద‌న వ్య‌క్తం చేశారు. సింగరేణిలో ఎస్సీ, ఎస్టీ ఉద్యోగులు, అధికారులు ఎదుర్కొంటున్న సమస్యలు, రిజర్వేషన్ల అమలు, బ్యాక్‌లాగ్ ఖాళీల భర్తీపై జాతీయ ఎస్సీ కమిషన్(National Commission for Scheduled Castes) ప్రత్యేక దృష్టి సారించింది. హైదరాబాద్ లోని కమిషన్ సభ్యుడు వడ్డేపల్లి రామచందర్(Vaddepalli Ramachander) అధ్యక్షతన సింగరేణి ఉన్నతాధికారులు, ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులతో వేర్వేరుగా సమీక్ష సమావేశాలు నిర్వహించారు.

ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ వెల్ఫేర్ అసోసియేషన్ ప్రతినిధులు పలు కీలక సమస్యలను కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు. రిజర్వేషన్ల అమలుపై అసోసియేషన్ ప్రతినిధులు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. సింగరేణి ఎడ్యుకేషన్ సొసైటీ పరిధిలోని పాఠశాలలు, ఉమెన్స్ కాలేజీ, పాలిటెక్నిక్ కాలేజీల్లో అడ్‌హాక్, తాత్కాలిక బోధన, బోధనేతర పోస్టుల భర్తీలో రిజర్వేషన్లు అమలు చేయడం లేదని తెలిపారు. బ్యాక్‌లాగ్ పోస్టుల భర్తీలోనూ జాప్యం జరుగుతోందని ప్రతినిధులు పేర్కొన్నారు. అర్హులైన అభ్యర్థులు అందుబాటులో ఉన్నా మూడేళ్లుగా ఎనిమిది సర్వేయర్ బ్యాక్‌లాగ్ పోస్టులతో పాటు హిందీ పండిట్ పోస్టులు భర్తీ చేయలేదని కమిషన్ దృష్టికి తీసుకెళ్లారు.

ఎస్సీ, ఎస్టీ ఉద్యోగుల సమస్యలకు శాశ్వత పరిష్కారం చూపేందుకు డైరెక్టర్‌ (పా) ఆధ్వర్యంలో ప్రతి మూడు నెలలకోసారి సమీక్ష సమావేశం నిర్వహించాలని అసోసియేషన్ ప్రతినిధులు కోరారు. ఉద్యోగుల సమస్యలు, ప్రమోషన్లు, రిజర్వేషన్ల అమలు.. అంశాలను పరిగణనలోకి తీసుకున్న జాతీయ ఎస్సీ కమిషన్ ప్రతినిధులు.. సింగరేణి యాజమాన్యంతో చర్చించి  న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.

ఈ సమావేశంలో ఎస్సీ, ఎస్టీ ఎంప్లాయిస్ అసోసియేషన్ కమిటీ వైస్ ప్రెసిడెంట్ బడికల కృష్ణ, డిప్యూటీ జనరల్ సెక్రటరీ దామెర ప్రవీణ్ కుమార్, కేంద్ర కార్యదర్శి మామిడిపల్లి మధు కృష్ణ, ఎస్‌టీపీపీ వైస్ ప్రెసిడెంట్ పులి సురేష్, రెసిడెంట్ డాక్ట‌ర్ రాజేశ్వ‌ర్‌, జ‌న‌ర‌ల్ సెక్ర‌ట‌రీలు ఆంథోని నాగేశ్వ‌ర్ రావు, గంగార‌పు లింగంపుర‌, క‌నుకుళ్ల తిరుప‌తి, సీనియ‌ర్ వైస్ ప్రెసిడెంట్ రామ‌చంద్ర‌, సెంట్రల్ వైస్ ప్రెసిడెంట్ ఎంవీ రావు త‌దిత‌రులు పాల్గొన్నారు. సింగరేణి సీఎండీ జ్యోతి బుద్ధ ప్రకాష్, డైరెక్టర్లు గౌతమ పొట్రు, తిరుమల రావు, జనరల్ మేనేజర్ (పర్సనల్/ఐఆర్‌పీఎం) జీవీ కిరణ్ కుమార్, జీఎం (వెల్ఫేర్) అజయ్ కుమార్ హాజరయ్యారు.

 

You might also like