మహిళ హత్య,,, మృతదేహంతో బిర్యాని
“ఒక మనిషిని చంపడం.. ఆపై శరీర భాగాలను సూట్‌కేసులో కుక్కి రైల్లో తరలించడం.. ఇదంతా వింటేనే గుండె జల్లుమంటుంది కదూ? కానీ, అంతకంటే అత్యంత ఘోరమైన షాకింగ్ నిజం వెలుగులోకి వచ్చింది! హత్య చేసిన ఆ మృతదేహ భాగాలతోనే ఏకంగా బిర్యానీ వండారు! వింటేనే రోమాలు నిక్కబొడుచుకునే ఈ దారుణ ఘటనకు సంబంధించిన పూర్తి వివరాలు”..
దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన అత్యంత కిరాతకమైన ఉదంతం వెలుగులోకి వచ్చింది. మహిళను అత్యంత క్రూరంగా హత్య చేసి, ఆమె శరీర భాగాలతో బిర్యానీ వండిన దారుణ ఘటన ఆలస్యంగా వెలుగుచూసింది. మిగిలిన శరీర భాగాలను ఓ సూట్‌కేసులో కుక్కి రైలులో తరలిస్తుండగా ఈ భయానక నిజం బయటపడింది.
ఈ నెల 5న చెన్నై నుంచి దిల్లీ బయలుదేరిన తమిళనాడు ఎక్స్‌ప్రెస్ రైలు ఉత్తరప్రదేశ్‌లోని ఆగ్రా రైల్వే స్టేషన్‌కు చేరుకుంది. ఆ సమయంలో జనరల్ కంపార్ట్మెంట్లో ఉన్న ఎరుపు రంగు సూట్‌కేసు నుంచి తీవ్రమైన దుర్వాసన రావడంతో ప్రయాణికులు రైల్వే పోలీసులకు సమాచారం అందించారు. పోలీసులు బోగిలోకి వెళ్లి ఆ సూట్‌కేస్‌ను తెరిచి చూడగా, అందులో ఛిద్రమైన స్థితిలో ఉన్న మానవ శరీర భాగాలు కనిపించడంతో అవాక్కయ్యారు.
ఉత్తరప్రదేశ్ పోలీసులు అందించిన సమాచారంతో తమిళనాడు రైల్వే పోలీసులు రంగంలోకి దిగారు. చెన్నై సెంట్రల్ రైల్వే స్టేషన్‌తో పాటు చుట్టుపక్కల ప్రాంతాల్లోని 350కి పైగా సీసీటీవీ ఫుటేజీలను పరిశీలించారు. ఓ పురుషుడు, మహిళ కలిసి ఎరుపు రంగు సూట్‌కేస్‌తో తమిళనాడు ఎక్స్‌ప్రెస్ ఎక్కడాన్ని గుర్తించారు. ఆపై సబర్బన్ రైలులో గూడువాంజేరి చేరుకుని, అక్కడి నుంచి ఆటోలో వెళ్లినట్లు తేల్చారు.
పోలీసుల సాయంతో అధికారులు నిందితుల నివాసానికి వెళ్లారు. ఇల్లంతా రక్తపు మరకలు ఉండగా, అక్కడే ఓ బిర్యానీ పాత్ర కనిపించింది. దాని మూతకు చుట్టూ మైదా పిండి అతికించి ఉండటంతో, అనుమానం వచ్చి మూత తీసి చూశారు. ఆ పాత్రలో రైస్‌తో పాటు మానవ శరీర ముక్కలు ఉండటం చూసి పోలీసులు దిగ్భ్రాంతి చెందారు. ఆ బిర్యానీ పాత్ర స్వాధీనం చేసుకుని చెంగల్పట్టు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం హత్యకు గురైన మహిళ తల కోసం గాలింపు చర్యలు ముమ్మరం చేశారు.
దర్యాప్తులో భాగంగా నిందితులను ఒడిశాకు చెందిన మాణిక్ ఉత్తిన్ లస్కర్, అతని భార్య భాగమతి మాజిక్‌గా గుర్తించారు. వీరితో పాటు ఒడిశాకే చెందిన హయాత్ నిషా అనే మహిళ కూడా వారితో కలిసి ఉంటోంది. భర్తతో విడిపోయిన హయాత్ నిషాయే ఈ హత్యకు గురైనట్లు పోలీసులు నిర్ధారించారు. నిషాకు 19 ఏళ్ల కుమారుడు ఉండగా, అతను చెన్నై తాంబరంలో ఏసీ మెకానిక్‌గా పనిచేస్తున్నాడు.