ఉచిత కోచింగ్ అర్హత పరీక్షకు భారీ స్పందన
ఎస్సై, కానిస్టేబుల్ ఉద్యోగాల కోసం ఆదిలాబాద్ జిల్లా పోలీసులు నిర్వహించనున్న 60 రోజుల ఉచిత కోచింగ్ కు సంబంధించి అర్హత పరీక్షకు 3,446 మంది అభ్యర్థులు హాజరయ్యారు. నలంద కళాశాల, శ్రీ చైతన్య, చావర పరీక్ష కేంద్రాల్లో పరీక్ష ప్రశాంతంగా కొనసాగింది. పరీక్షలో ఉత్తమ ప్రతిభ కనబరిచిన అభ్యర్థులతో పాటు ఆదిలాబాద్ జిల్లాకు చెందిన ఆదివాసీ అభ్యర్థులకు ప్రత్యేక ప్రాధాన్యత కల్పిస్తూ దాదాపు 300 మందిని ఎంపిక చేసి ఉచిత శిక్షణ అందించనున్నారు.
పరీక్ష కేంద్రాలను జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్ పర్యవేక్షించారు. అభ్యర్థులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా సుమారు 200 మంది పోలీస్ సిబ్బందితో పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. నిరుద్యోగ యువత పోటీ పరీక్షల్లో రాణించి ప్రభుత్వ ఉద్యోగాలు సాధించేందుకు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఎస్పీ ఆకాంక్షించారు.