ఖర్గేను కలిసిన కొండా సురేఖ
ఏఐసీసీ అధినేత ఖర్గేతో మంత్రి కొండా సురేఖ భేటీ అయ్యారు. తెలంగాణ కాంగ్రెస్ రాజకీయాల్లో కొన్ని రోజులుగా జరుగుతున్న పరిణామాలు తీవ్ర సంచలనం రేపుతున్నాయి. ఈ నేపథ్యంలోనే రాష్ట్ర అడవులు, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ కర్ణాటక రాజధాని బెంగళూరులో ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గేతో అత్యవసరంగా భేటీ అయ్యారు. దాదాపు 15 నిముషాల పాటు సాగిన ఈ సమావేశంలో రాష్ట్రంలో మారుతున్న రాజకీయ సమీకరణాలపై ఇరువురి మధ్య కీలక చర్చలు జరిగినట్లు సమాచారం.
కొండా సురేఖ కుమార్తె కొండా సుష్మిత ఇటీవల ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని ఉద్దేశించి చేసిన తీవ్ర వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీలో పెద్ద దుమారం రేపాయి. సీఎం కుటుంబానికి భూముల డీలింగ్స్ ఉన్నాయని, కాంగ్రెస్ కాస్త “టీడీపీ కాంగ్రెస్” లాగా మారిందంటూ ఆమె చేసిన ఆరోపణలు పార్టీ వర్గాల్లో తీవ్ర కలకలం సృష్టించాయి. సుష్మిత వ్యాఖ్యల వెనుక మంత్రి కొండా సురేఖ హస్తం ఉందనే అనుమానాన్ని వ్యక్తం చేస్తూ దాదాపు 20 మందికి పైగా కాంగ్రెస్ ఎమ్మెల్యేలు, ప్రభుత్వ విప్లు సంయుక్తంగా ప్రెస్ కాన్ఫరెన్స్ నిర్వహించారు. మంత్రి సురేఖను తక్షణమే మంత్రివర్గం నుండి బర్తరఫ్ చేయాలని వారు బహిరంగంగా డిమాండ్ చేశారు.
ఈ వివాదంపై టీపీసీసీ
డిసిప్లినరీ యాక్షన్ కమిటీ చైర్మన్ మల్లు రవి ఆధ్వర్యంలో సమీక్ష జరిగింది. పార్టీ క్రమశిక్షణ ఉల్లంఘన కింద వివరణ కోరుతూ నోటీసులు ఇవ్వగా, సురేఖ తన వివరణ సమర్పించారు. తనపై కొందరు నేతలు కావాలనే దుష్ప్రచారం చేస్తున్నారని ఆమె క్రమశిక్షణా కమిటీకి లేఖ రాశారు.
ఈ నేపథ్యంలో బెంగళూరు భేటీలో వరంగల్ జిల్లా అంతర్గత రాజకీయాలు, పరకాల నియోజకవర్గ వివాదాలు (సిట్టింగ్ ఎమ్మెల్యే రేవూరి ప్రకాష్ రెడ్డితో విభేదాలు) రాష్ట్ర కాంగ్రెస్లో ఒరిజినల్ కాంగ్రెస్ నేతలకు జరుగుతున్న అన్యాయం గురించి కొండా సురేఖ అధిష్ఠానానికి వివరించినట్లు తెలుస్తోంది. మాజీ ఏఐసీసీ ఇన్చార్జ్ ఒకరు ఈ భేటీని సమన్వయం చేసినట్లు రాజకీయ వర్గాల్లో బలంగా ప్రచారం జరుగుతోంది.
ఇదిలా ఉండగా, బెంగళూరు ప్రయాణంలో భాగంగా శంషాబాద్ ఎయిర్పోర్టులో బీజేపీ సీనియర్ నేత ఎన్. రామచందర్ రావును కొండా సురేఖ కలవడం రాజకీయ వర్గాల్లో మరో కొత్త చర్చకు దారితీసింది. అయితే ఇది కేవలం యాదృచ్ఛికంగా జరిగిన భేటీయేనని కొందరు అంటున్నా, ప్రస్తుత పరిస్థితుల్లో ఈ భేటీకి ప్రాధాన్యత ఏర్పడింది.ప్రస్తుతం టీపీసీసీ డిసిప్లినరీ కమిటీ మంత్రి సురేఖ ఇచ్చిన వివరణను పరిశీలిస్తోంది. ఈ నేపథ్యంలో ఏఐసీసీ అధిష్ఠానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతుందనేది ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది.