చదువులు చెప్పేవారే లేరు.. గోడ దూకిన విద్యార్థులు!
బెల్లంపల్లిలోని సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో విద్యార్థుల సమస్యలు ఆందోళనకు దారితీశాయి. సరైన స్థాయిలో విద్యాబోధన అందించే సిబ్బంది లేకపోవడంతో చదువులు దెబ్బతింటున్నాయని విద్యార్థులు చాలాకాలంగా అధికారుల దృష్టికి తీసుకెళ్లారు. పలుమార్లు విన్నవించినా సమస్య పరిష్కారం కాకపోవడంతో విద్యార్థుల్లో అసంతృప్తి పెరిగింది.
ఈ నేపథ్యంలో సోమవారం ఉదయం 2.30 ప్రాంతంలో సుమారు 35 మంది విద్యార్థులు గోడ దూకి పాఠశాల నుంచి బయటకు వచ్చారు. తమ సమస్యను ఉన్నతాధికారుల దృష్టికి నేరుగా తీసుకెళ్లాలని నిర్ణయించుకున్న విద్యార్థులు.. బెల్లంపల్లి రైల్వే స్టేషన్కు చేరుకుని భాగ్యనగర్ రైలు ఎక్కి హైదరాబాద్ వెళ్లేందుకు ప్రయత్నించారు. హైదరాబాద్కు వెళ్లి సంబంధిత అధికారులను కలవడంతో పాటు, అవసరమైతే మంత్రిని కలిసి తమ సమస్యను వివరిస్తే పరిష్కారం లభిస్తుందని విద్యార్థులు భావించారు.
అయితే విద్యార్థులు పాఠశాల నుంచి బయటకు వచ్చిన విషయం తెలుసుకున్న వార్డెన్ వెంటనే పోలీసులకు సమాచారం అందించారు. దీంతో పోలీసులు అక్కడికి చేరుకుని విద్యార్థులతో మాట్లాడారు. సమస్యలను తెలుసుకుని వారికి నచ్చజెప్పి తిరిగి పాఠశాలలోకి పంపించారు. చదువుకోవాల్సిన వయసులో.. తమ చదువుల కోసం విద్యార్థులు గోడ దూకి రైలెక్కే పరిస్థితి ఎందుకొచ్చింది? అన్న ప్రశ్న ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది.
విద్యార్థులు చాలాకాలంగా చెబుతున్న సమస్యలను అధికారులు ముందుగానే పరిష్కరించి ఉంటే ఈ పరిస్థితి వచ్చేది కాదన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. గురుకులంలో విద్యాబోధనకు సరిపడా సిబ్బందిని ఏర్పాటు చేయడంతో పాటు.. విద్యార్థుల సమస్యలను అధికారులు స్వయంగా తెలుసుకుని తక్షణమే పరిష్కరించాలని తల్లిదండ్రులు, విద్యార్థి సంఘాల నుంచి డిమాండ్లు వినిపిస్తున్నాయి. విద్యార్థులు గోడ దూకే వరకు పరిస్థితి వెళ్లడం.. గురుకుల విద్యా వ్యవస్థలో పర్యవేక్షణ ఎలా ఉందన్న ప్రశ్నను లేవనెత్తుతోంది.