142 సెల్‌ఫోన్లు అందించిన సీపీ అంబ‌ర్ కిషోర్ ఝా

రామగుండం పోలీస్ కమిషనరేట్ పరిధిలో చోరీకి గురైన, పోగొట్టుకున్న 142 సెల్‌ఫోన్లను (సుమారు రూ. 27.40 లక్షల విలువ) సీసీఎస్, ఐటీ సెల్ బృందాలు రికవరీ చేశాయి. మంగళవారం ఏర్పాటు చేసిన ‘సెల్‌ఫోన్ రికవరీ మేళా’లో రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా వీటిని బాధితులకు అందజేశారు. ఇప్పటివరకు కమిషనరేట్ పరిధిలో సీఈఐఆర్ (CEIR) పోర్టల్ ద్వారా 10,420 ఫిర్యాదులు రాగా, 3,717 ఫోన్లను రికవరీ చేసి యజమానులకు అప్పగించినట్లు సీపీ వెల్లడించారు.

ఫోన్ల రికవరీ కోసం సీసీఎస్‌తో పాటు ప్రతి పోలీస్ స్టేషన్‌లోనూ ప్రత్యేక విభాగాన్ని ఏర్పాటు చేసినట్లు తెలిపారు. మొబైల్ ఫోన్ పోగొట్టుకున్నా, దొంగతనానికి గురైనా వెంటనే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన ‘సీఈఐఆర్’ (CEIR) పోర్టల్‌లో ఫోన్‌ను బ్లాక్ చేయాలని సూచించారు. అనంతరం స్థానిక పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయాలన్నారు.

పోర్టల్‌లో నమోదు చేయడం వల్ల ఆ మొబైల్‌ను ఇతర నెట్‌వర్క్‌లలో వాడకుండా నిరోధించవచ్చని, తద్వారా దొంగిలించిన ఫోన్ వాడకం కష్టతరమై, రికవరీ సులభమవుతుందని వివరించారు. కార్యక్రమంలో అదనపు డీసీపీ కె.శ్రీనివాస్, సీసీఎస్ ఏసీపీలు రవీందర్, ప్రవీణ్ కుమార్, ఐటీ కోర్ ఇన్‌స్పెక్టర్ చంద్రశేఖర్ గౌడ్ సహా ఇతర సీసీఎస్, ఐటీ సెల్ అధికారులు, సిబ్బంది పాల్గొన్నారు.

You might also like