పాఠశాలలో పొలిటికల్ షో.. విద్యార్థులతో కవాతు!
విద్యార్థుల భవిష్యత్తుకు బాటలు వేయాల్సిన పాఠశాల అది.. ఓ రాజకీయ నాయకుడి మెప్పు కోసం విద్యార్థులతో కవాతు చేయించారు.. విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాల్సిన అధికారులు, ఉపాధ్యాయులు వారితో ఎందుకు స్వాగతం పలికించారు. ఈ కవాతుకు అనుమతి ఇచ్చింది ఎవరు? నిబంధనలు ఉల్లంఘించారా..? మీడియా వస్తే సవాలక్ష నిబంధనలు.. రాజకీయ నేతలకు ఘన స్వాగతాలు… ఈ మినహాయింపులు దేని కోసం…? ఎవరి మెప్పు కోసం… ?
మంచిర్యాల జిల్లా బెల్లంపల్లిలో నిర్వహించిన ఓ కార్యక్రమం వివాదాస్పదంగా మారింది. మిలాద్ ఉన్ నబీ సందర్భంగా గిరిజన ఆశ్రమ పాఠశాల విద్యార్థులకు పండ్లు పంపిణీ చేసేందుకు వెళ్లిన ఓ కాంగ్రెస్ నాయకుడు వెళ్లారు. అంత వరకు బాగానే ఉంది… కానీ, ఆ కాంగ్రెస్ నాయకుడికి విద్యార్థులు లాంఛనంగా కవాతు చేస్తూ స్వాగతం పలకడం చర్చనీయాంశంగా మారింది. అసలు విద్యార్థులతో కవాతు చేయించాలని నిర్ణయించింది ఎవరు…? పాఠశాల ప్రిన్సిపల్ అనుమతి ఇచ్చారా..? ఉన్నతాధికారుల నుంచి ముందస్తు అనుమతులు తీసుకున్నారా…? అన్న అంశాలపై చర్చ జరుగుతోంది.
విద్యార్థులను రాజకీయ కార్యక్రమాలకు దూరంగా ఉంచాల్సిన బాధ్యత పాఠశాల యాజమాన్యం, అధికారులపై ఉంటుంది. అలాంటప్పుడు రాజకీయ నాయకుడి రాక సందర్భంగా విద్యార్థులను కవాతులో పాల్గొనేలా చేయడంపై విద్యార్థి సంఘాలు, పలువురు విద్యార్థులు అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు విద్యార్థుల సమస్యలను కవరేజ్ చేసేందుకు వెళ్లే మీడియాకు ఆశ్రమ పాఠశాలలోకి అనుమతి ఇవ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీంతో రాజకీయ నాయకులకు పాఠశాలలో కార్యక్రమాలు నిర్వహించేందుకు అనుమతి ఎలా లభించింది? మీడియాకు ఒక నిబంధన.. రాజకీయ నాయకులకు మరో నిబంధనా? అంటూ ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
విద్యార్థుల భద్రత, విద్యా వాతావరణం, పాఠశాలల రాజకీయ రహిత నిర్వహణపై అధికారులు స్పష్టత ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఈ వ్యవహారంపై గిరిజన సంక్షేమ శాఖ ఉన్నతాధికారులు స్పందించి.. కవాతుకు ఎవరు అనుమతి ఇచ్చారు…? కార్యక్రమం ఏ నిబంధనల ప్రకారం నిర్వహించారు…? అనే అంశాలపై సమగ్ర విచారణ జరిపి వాస్తవాలను వెల్లడించాల్సిన అవసరం ఉంది.