శాసన మండలి మీడియా పాయింట్ వద్ద ఉద్రిక్తత
శాసన మండలి మీడియా పాయింట్ వద్ద తీవ్ర ఉద్రిక్తత చోటుచేసుకుంది. ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డి మీడియాతో మాట్లాడుతుండగా.. మార్షల్స్ వారిని బలవంతంగా అక్కడి నుంచి తరలించారు. మీడియాతో మాట్లాడుతున్న సమయంలోనే మార్షల్స్ ఇద్దరు ఎమ్మెల్సీలను అదుపులోకి తీసుకుని బయటకు తీసుకెళ్లారు. అనంతరం వారిద్దరినీ పోలీసు వాహనంలో తరలించారు.
ఈ ఘటనతో శాసన మండలి ప్రాంగణంలో కొద్దిసేపు ఉద్రిక్త వాతావరణం నెలకొంది. కాగా.. సభా నిబంధనలను ఉల్లంఘించినందుకు ఎమ్మెల్సీలు తాతా మధు, నవీన్ రెడ్డిపై శాసన మండలి కీలక నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత సమావేశాలు ముగిసే వరకు ఇద్దరు ఎమ్మెల్సీలను సస్పెండ్ చేస్తూ శాసన మండలి నిర్ణయించింది. ఇద్దరు ఎమ్మెల్సీలను తెలంగాణ భవన్‌కు తరలిస్తున్నట్లు సమాచారం.
అంతుకుముందు BRS MLCలు తాతా మధు, నవీన్ రెడ్డిపై శాసన మండలిలో సస్పెన్షన్ వేటు పడింది. శాసనమండలిలో మంత్రి శ్రీధర్ బాబు ఈ మేరకు తీర్మానం ప్రవేశపెట్టారు. దీనిపై మూజువాణి పద్ధతిలో ఓటింగ్ నిర్వహించగా తీర్మానం నెగ్గింది. దీంతో వీరిద్దరినీ ఈ సెషన్ మొత్తం సస్పెండ్ చేస్తున్నట్లు మండలి ఛైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి ప్రకటించారు. మరోవైపు.. ఎమ్మెల్సీలు నవీన్ రెడ్డి, తాతా మధు రిమాండ్‌ను కోర్టు తిరస్కరించింది.