మంచి నీళ్ల కోసం కొట్టుకున్న పాక్ సైనికులు

పాకిస్తాన్ ప్రగల్భాలు వింటే ఆకాశమే హద్దు. అణ్వస్త్రాలున్నాయంటూ పదే పదే మీసాలు మెలేసే దేశం అసలు పరిస్థితి చూస్తే మాత్రం నవ్వుకోక తప్పదు. సరిహద్దుల్లో శత్రువులతో పోరాడాల్సిన సైనికులు, గుక్కెడు మంచినీళ్ల కోసం ఒకరి తలలు ఒకరు పగలగొట్టుకుంటూ తమ ‘గొప్ప క్రమశిక్షణను’ ప్రపంచానికి చాటిచెబుతున్నారు.

తాజాగా పాకిస్తాన్‌లోని అప్పర్ సౌత్ వజీరిస్తాన్‌ అస్మాన్ మాంజా బ్రిగేడ్ హెడ్‌క్వార్టర్స్‌లో ఒక మహా సంగ్రామం జరిగింది. ఈ యుద్ధంలో పాల్గొన్నది సాదాసీదా సైనికులు కాదు.. ఏకంగా స్పెషల్ సర్వీస్ గ్రూప్ (ఎస్‌ఎస్‌జీ) కమాండోలు, ఫ్రంటియెర్ కార్ప్స్ (ఎఫ్‌సీ) దళాలు, మిలిటరీ ఇంటెలిజెన్స్ (ఎంఐ) సిబ్బంది! వీళ్లందరి లక్ష్యం శత్రు శిబిరాన్ని నాశనం చేయడం కాదు… వచ్చిన ‘ఒక మంచినీళ్ల ట్యాంకర్‌’ను ఆక్రమించడం.

ఆ ప్రాంతంలో నీటి కరువు తీవ్రంగా ఉండటంతో ట్యాంకర్ల ద్వారా నీరు సరఫరా చేస్తున్నారు. ఎంతోకాలంగా నీళ్ల కోసం ఎదురుచూస్తున్న ఈ ఎలైట్ దళాలకు ట్యాంకర్ రాగానే ప్రాణం లేచివచ్చినంత పనైంది. ఇంకేముంది, “ముందు మేమంటే మేమే పట్టుకుంటాం” అంటూ గ్రూపుల మధ్య తీవ్రస్థాయిలో వాగ్వాదం జరిగింది. అది కాస్తా ముదిరి, ఒకరిపై ఒకరు విచక్షణారహితంగా దాడులు చేసుకుని, ఫ్రీస్టైల్ కుస్తీలు పట్టే స్థాయికి చేరింది.

శత్రువుల తూటాలకు కాదు, తోటి సైనికుల పిడిగుద్దులు, దాడులకు సుమారు 22 మంది సైనికులు తీవ్రంగా గాయపడి ఆసుపత్రి పాలయ్యారు. ఎస్‌ఎస్‌జీ లాంటి అత్యుత్తమ కమాండో దళాలు ఒక నీళ్ల ట్యాంకర్ దగ్గర వీధి రౌడీల్లా కొట్టుకోవడం పాక్ సైన్యం ‘ప్రొఫెషనలిజం’ ఏ స్థాయిలో ఉందో బట్టబయలు చేసింది. దేశ సరిహద్దులు కాపాడే సైనికులకు కనీసం తాగునీరు కూడా అందించలేని పాకిస్తాన్ ప్రభుత్వ ఆర్థిక, నిర్వహణాపరమైన దివాళాకోరుతనం మరోసారి ప్రపంచం ముందు నవ్వులపాలైంది.

బయటకేమో ఆసియాలోనే బలమైన సైన్యం అంటూ గర్జిస్తూ, లోపల మాత్రం గుక్కెడు నీటి కోసం కుస్తీలు పడుతున్న పాక్ పరిస్థితి చూస్తుంటే… “గొప్పలకేమో పోయేకాలం, గుక్కెడు నీళ్లకు కరువొచ్చిన కాలం” అన్న సామెత గుర్తుకురాక మానదు.

You might also like