ఇదేం విచార‌ణ‌

ఐసీడీఎస్ సూప‌ర్ వైజ‌ర్ తీరుపై గ్రామ‌స్థుల ఆగ్ర‌హం

మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అధికారుల తీరుపై న‌క్క‌ల‌ప‌ల్లి గ్రామ‌స్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఇంత అవినీతి జ‌రుగుతున్నా తాత్సారం చేయ‌డం ఏమిట‌ని…? మీరు అవినీతి, అక్ర‌మాలు చేస్తున్న టీచ‌ర్ల‌ను కాపాడ‌టానికి వ‌చ్చారా..? అంటూ దుయ్య‌బ‌ట్టారు. గ‌తంలో విచార‌ణ చేసిన మీరు మ‌ళ్లీ వ‌స్తాన‌ని చెప్ప‌డం ఏమిట‌ని ప్ర‌శ్నించారు. మ‌రోవైపు పోలీసుల‌కు ఫిర్యాదు చేసేందుకు కొంద‌రు సిద్ధం కావ‌డంతో ఈ ఘ‌ట‌న మ‌రింత ముదిరేలా క‌నిపిస్తోంది….

మంచిర్యాల జిల్లా కోట‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌ప‌ల్లి 1 అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌లో పెండ్లి కాని మ‌హిళ‌కు పెండ్లి అయిన‌ట్లు… ఆమె గ‌ర్భ‌వ‌తి అయిన‌ట్లు, డెలివరీ సైతం అయిన‌ట్లు రికార్డుల్లోకి ఎక్కించింది అక్క‌డి అంగ‌న్‌వాడీ టీచ‌ర్.. ఈ వ్య‌వ‌హారం కాస్తా బ‌య‌ట‌ప‌డ‌టంతో గ్రామ‌స్థులు అవాక్క‌య్యారు. కొంద‌రు ఏకంగా క‌లెక్ట‌ర్‌కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆయ‌న విచార‌ణ‌కు ఆదేశించారు. రెండు రోజుల కింద‌ట సూప‌ర్‌వైజ‌ర్ సంధ్య విచార‌ణ చేశారు. అయితే, పోష‌ణ్ ట్రాక‌ర్ యాప్‌కు సంబంధించి న‌క్క‌ల‌ప‌ల్లి-1, బ‌ద్దంప‌ల్లి సెంట‌ర్ల ల‌బ్ధిదారుల వివరాల‌ను లాక్ చేశారు. దీంతో త‌మ‌కు స‌రైనా స‌మాచారం లేద‌ని మ‌ళ్లీ వ‌స్తానంటూ సూప‌ర్‌వైజ‌ర్ వెళ్లిపోయారు. తిరిగి శ‌నివారం వ‌చ్చిన ఆమె లాక్ తీయ‌లేద‌ని, మ‌ళ్లీ బుధ‌వారం వ‌స్తాన‌ని చెప్ప‌డంతో గ్రామ‌స్థులు తీవ్ర ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు.

విచార‌ణ చేసి నివేదిక ఇవ్వాల్సిన అధికారులు విచార‌ణ పేరుతో ఆల‌స్యం చేయ‌డంపై వారు ఆగ్ర‌హం వ్య‌క్తం చేశారు. ఈ అవినీతిలో అధికారుల‌కు సైతం పాత్ర ఉంద‌ని అందుకే కావాల‌ని జాప్యం చేస్తున్నార‌ని దుయ్య‌బ‌ట్టారు. పెండ్లి కాని పిల్ల‌కు పెండ్లి అయిన‌ట్లు, గ‌ర్భం ధ‌రించిన‌ట్లు రికార్డుల్లో ఎక్కించ‌డం ఏమిట‌ని మండిప‌డ్డారు. రేప‌టి రోజున త‌న‌కు ఎలా పెండ్లి అవుతుందంటూ అటు అంగ‌న్‌వాడీ టీచ‌ర్‌, ఇటు సూప‌ర్‌వైజ‌ర్ పై విరుచుకుప‌డ్డారు. ఈ వ్య‌వ‌హారంలో అధికారులు, సూప‌ర్వైజర్ పాత్ర కూడా ఉందని సీరియ‌స్ అయ్యారు. ఇలా చేసే బ‌దులు అడుక్కుతిన‌మంటూ టీచ‌ర్ పై దుమ్మెత్తిపోశారు.

 

You might also like