వేధింపులపై షీ టీమ్స్ ఆశ్రయించండి
మహిళలు ఎలాంటి వేధింపులకు గురైనా భయపడకుండా వెంటనే షీ టీమ్స్‌ను ఆశ్రయించాలని మంచిర్యాల జిల్లా షీ టీమ్ పోలీసులు సూచించారు. రామగుండం పోలీస్ కమీషనరేట్ మంచిర్యాల, గోదావరి రోడ్‌లోని ఏకలవ్య ఆశ్రమంలో సేవాభారతి ఆధ్వర్యంలో ఉచిత కంప్యూటర్, బ్యూటీషియన్ టైలరింగ్ శిక్షణా కోర్సులు నేర్చుకుంటున్న మహిళలకు శుక్రవారం జిల్లా షీ టీమ్ పోలీస్ కమీషనర్ ఆదేశాల మేరకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు.
ఈ సందర్భంగా షీ టీమ్ సిబ్బంది మాట్లాడుతూ… మహిళలు సమాజంలో, కార్యాలయాల్లో, ప్రయాణ సమయంలో, సోషల్ మీడియా మాధ్యమాల్లో వివిధ రకాల వేధింపులను ఎదుర్కొంటున్నారని తెలిపారు. కుటుంబ గౌరవం, భయం సామాజిక ఒత్తిడి కారణంగా అనేక మంది మహిళలు తమ సమస్యలను బయటకు చెప్పలేకపోతున్నారని వెల్లడించారు. మహిళల రక్షణ కోసం ప్రభుత్వం షీ టీమ్స్ వంటి ప్రత్యేక పోలీసు విభాగాలు నిరంతరం అండగా అందుబాటులో ఉన్నాయని వివరించారు.
వేధింపులకు గురైన మహిళలు వెంటనే రామగుండం షీ టీమ్ వాట్సాప్ నంబర్ 6303923700, మంచిర్యాల షీ టీమ్ నంబర్ 8712659385 కానీ, అత్యవసర సమయంలో డయల్ 112కు సమాచారం అందించాలని సూచించారు. మహిళలు తమ సమస్యలను దాచుకోకుండా ధైర్యంగా పోలీసులను ఆశ్రయించాలని, సమాజంలో మహిళలకు సురక్షితమైన వాతావరణం కల్పించడమే షీ టీమ్స్ ప్రధాన లక్ష్యమని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంచిర్యాల జిల్లా షీ టీమ్ సిబ్బంది కానిస్టేబుళ్లు సతీష్, వనిత నిర్వాహకులు అంజి ,సిబ్బంది శిక్షణ పొందుతున్న మహిళలు పాల్గొన్నారు.