వేటు వేస్తారా..? వేచి చూస్తారా..?
కంది శ్రీనివాస్‌రెడ్డిపై అధిష్టానం నిర్ణయమేంటి..?
సొంత పార్టీ నేతలపైనే తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ వరుస వివాదాల్లో చిక్కుకుంటున్న ఓ నేతపై అధిష్టానం ఎలాంటి నిర్ణయం తీసుకోబోతోంది..? ఒక్కసారి కాదు.. రెండుసార్లు షోకాజ్ నోటీసులు ఇచ్చి.. ఎందుకు తాత్సారం చేస్తున్నారు..? వేటు తప్పదా..? లేక మరోసారి నాన్చివేత ధోరణినే అవలంబిస్తారా..? కాంగ్రెస్ అధిష్టానం మనసులో ఏముంది..? క్రమశిక్షణా కమిటీ తదుపరి అడుగు ఏంటి..? లేటా..? వేటా..? నాంది న్యూస్ ప్రత్యేక కథనం…
ఆదిలాబాద్ ఉమ్మడి జిల్లా కాంగ్రెస్‌లో ఓ నేత వ్యవహార శైలి ప్రతిసారీ వివాస్పదంగా మారుతోంది. సాధారణ సమావేశం అయినా, ప్రెస్మీట్లు అయినా, ఆఖరికి రోడ్ షో అయినా… సొంత పార్టీ పీఏసీ సమావేశం అయినా ఆయన నోరు తెరిస్తే బూతు పురాణమే…. టాప్ మోస్ట్ యూనివర్సిటీలో ఉన్నతమైన చదువులు చదువుకున్నానంటూ ప్రతీసారి చెప్పే ఆ నాయకుడి మాటల తీరు జనం అసహ్యించుకునేలా ఉంది. క్షేత్రస్థాయిలో ప్రతిపక్షాలను, ప్రత్యర్థి వర్గాన్ని విమర్శలు చేస్తే పర్లేదు… కానీ, ఏఐసీసీ నేతల ముందే సొంత పార్టీ నేతలపై ల భాషతో… రెచ్చిపోవడం దాంటో పాటు సీనియర్ నేత సంజీవ రెడ్డిపై దుర్భాషలాడటం రచ్చకు దారి తీసింది…
ఈ సందర్భంగా ఆ నాయకుడు వాడిన భాష ఉపయోగించిన పదాలు సొంత పార్టీ నేతలే ఇదేం చిల్లర భాష అంటూ ముక్కున వేలు వేసుకున్నారు. ఆయన వ్యవహార శైలిలో ఏఐసీసీ సెక్రటరీ సచిన్ సావంత్, మంత్రి జూపల్లి కృష్ణారావు ఆగ్రహం వ్యక్తం చేశారు. పొలిటికల్ ఎఫైర్స్ కమిటీలో తమ వర్గానికి చెందిన వారి పేర్లు లేవని గొడవకు దిగడం వివాదస్పదంగా మారింది. ఇదే విషయమై డీసీసీ అధ్యక్షుడి నివేదిక, బాధిత నాయకులు క్రమశిక్షణా సంఘానికి ఫిర్యాదు చేశారు. దీంతో ఆయనకు షోకాజ్ నోటీసులు జారీ చేశారు. ఆ తర్వాత మంత్రి కొండా సురేఖ, చిన్నారెడ్డిల అంశం రాష్ట్ర స్థాయి చర్చకు దారి తీసింది. ఈ నేపథ్యంలో తనకేమీ కాదని భావించారు. అయితే, క్షమశిక్షణ కమిటీ మరోసారి ఆయనకు నోటీసులు జారీ చేసింది. ఈసారి పది రోజుల పాటు సమయం ఇచ్చింది…
ఆదిలాబాద్ నియోజకవర్గ కాంగ్రెస్ నాయకుడు కంది శ్రీనివాస్ రెడ్డి వ్యవహారం జిల్లా కాంగ్రెస్‌లో కలహాలకు కారణమవుతోంది. ఉట్నూరులో జరిగిన పొలిటికల్ అఫైర్స్ కమిటీ సమావేశంలో అదే పార్టీ నాయకుడు సంజీవరెడ్డిపై కంది శ్రీనివాస్ రెడ్డి గొడవకు దిగడమే కాకుండా బండబూతులు తిట్టాడు. ఆ తర్వాత సంజీవరెడ్డి మీడియాతో మాట్లాడుతూ కంది శ్రీనివాస్ రెడ్డే తన లక్ష్యం అంటూ… ఆయనకు టిక్కెట్టు రాకుండా చూడటమే నా లక్ష్యం… అధిష్టానాన్ని ఎదిరించి అయినా ఆయనకు టిక్కెట్టు రాకుండా పోరాడటతానంటూ స్పష్టం చేశారు. అధిష్టానం కంది శ్రీనివాస్ రెడ్డికి రెండోసారి నోటీసులు జారీ చేసిన సమయంలోనే క్షమశిక్షణా సంఘం సంజీవరెడ్డిని సంజాయిషీ అడిగింది. సంజీవరెడ్డి నోటీసుల అంశం కంది శ్రీనివాస్ రెడ్డి వర్గం పూర్తిగా వైరల్ చేసింది. ఇది కూడా పార్టీలో అంతర్గత చర్చకు దారి తీసింది. వాస్తవానికి ప్రకటన జారీ చేయాలంటే పీసీసీ లేకపోతే క్షమశిక్షణా సంఘం విడుదల చేస్తుంది. కానీ, ప్రత్యర్థిగా భావించే కంది శ్రీనివాస్‌రెడ్డి నోటీసు వైరల్ చేయడం అంతర్గత పోరుకు మరింత ఆజ్యం పోసింది. ఇదే అంశం ఇప్పుడు సీనియర్లు, జూనియర్లుగా మారుతోంది.
కంది శ్రీనివాస్ రెడ్డి బీజేపీ నుంచి వచ్చి కాంగ్రెస్ కండువా కప్పుకున్న నాటి నుంచి ఆయన వ్యవహార శైలి వివాదస్పదం అవుతోంది. గతంలో పార్టీ సీనియర్ నాయకురాలు గండ్రత్ సుజాత ముక్కు చెవులు కోస్తా అనడం ఆ అంశాన్ని ప్రత్యర్థి పార్టీలు అసెంబ్లీ ఎన్నికల్లో అస్త్రంగా మలుచుకున్నాయి. కాంగ్రెస్ పార్టీ టిక్కెట్టు కంది శ్రీనివాస్ రెడ్డికి రాగా, ఒక బీసీ బిడ్డను రెడ్డి వర్గం నేత ఇష్టం వచ్చినట్లు తిడుతున్నారంటూ మిగతా పార్టీలు వైరల్ చేశాయి. అది కాస్తా ప్రజల్లోకి బలంగా వెళ్లి కాంగ్రెస్ పార్టీ ఓటమిపాలయ్యింది. అయినా తర్వాతనైనా మారుతారనుకుంటే కాంగ్రెస్ అధికార ప్రతినిధి గోవర్ధన్ రెడ్డిని ఉద్దేశిస్తూ ఓ సభలో దూర్భాషలాడాడు.
ఆయన మాట తీరు సరిగా లేదని ఆవేశపరుడని ఇలా అన్నింటిని పరిగణలోకి తీసుకున్న అధిష్టానానికి నేతల నుంచి అందిన వరుస ఫిర్యాదులు సైతం పరిగణలోకి తీసుకుంది. ఇప్పటి వరకు రెండు సార్లు నోటీసులు ఇచ్చినా చివరకు వేటు వేస్తుందా..? లేక నాన్చుతుందా…? అనే ఆసక్తికరమైన చర్చ సాగుతోంది. తనకు అధిష్టానం అండ ఉన్నదనే ఉద్దేశంతోనే కంది శ్రీనివాస్ రెడ్డి రెచ్చిపోతున్నారని ప్రత్యర్థి వర్గం ఆరోపిస్తోంది. మరి హైదరాబాద్ పెద్ద నేతల అండతో కంది బయటపడతారా..? లేక ఏఐసీసీ సెక్రటరీ, రాష్ట్ర వ్యవహారాల ఇన్ చార్జీ మీనాక్షి నటరాజన్ నేతల ఒత్తిళ్లు తప్పించుకుంటారా..?
మరి అధిష్టానం వేటేందుకే మొగ్గు చూపుతోందా..? లేక నాన్చివేత ధోరణితో ముందుకు వెళ్తుందా..? ఏఐసీసీ పెద్దల ముందే సొంత పార్టీ నేతలను బండబూతులు తిట్టిన ఆ నాయకుడు లేకపోతే పార్టీ మనుగడ అసాధ్యం అవుతుందా..? ఎన్నికలు అయినా, సాధారణ సమయం అయినా వీలు దొరికినప్పుడల్లా పక్క నేతలతో పాటు సొంత పార్టీ నేతలపైనా నోరు పారేసుకుంటేనే ప్రజల్లో పేరుటుందని భావిస్తున్నారు ఆ నేత… ఇంతకీ ఆదిలాబాద్ కాంగ్రెస్ పార్టీలో ఏం జరుగుతోంది…? అధిష్టానం మనసులో ఏముంది…? క్రమ శిక్షణా కమిటీ ఏం చేయబోతోంది…? వేచి చూడాల్సిందే..