పెండ్లి కాకున్నా పిల్ల‌ల‌ట‌… బీటెక్ చ‌దివిన వారికి రెండేళ్ల‌ట‌…

ఆ అమ్మాయికి పెండ్లి కాలేదు… కానీ ఐసీడీఎస్ అధికారుల రికార్డుల్లో పెండ్లి అయ్యింది…

గర్భం దాల్చకపోయినా గర్భవతిని చేసేశారు..
డెలివరీ కూడా చేయించేశారు..!

ఇక బీటెక్ చదివిన యువకుడి వయసు ఎంతంటే…
రెండేళ్ల రెండు రోజులట..!

ఇదేదో సినిమాలో వచ్చే కామెడీ సీన్ కాదు…
మంచిర్యాల జిల్లా చెన్నూరు ఐసీడీఎస్ ప్రాజెక్టు పరిధిలోని ఓ అంగన్‌వాడీ కేంద్రానికి సంబంధించిన రికార్డులపై వస్తున్న తీవ్ర ఆరోపణలు.

లబ్ధిదారుల పేర్లు మార్చడం..
పిల్లల పేర్లతో సరుకులు తీసుకున్నట్టు చూపించడం..
వాస్తవంగా వారికి అందాల్సిన సరుకులు అందకపోవడం..
గతంలోనూ ఇదే కేంద్రానికి సంబంధించిన సరుకులు అక్రమంగా తరలిస్తూ పట్టుబడిన ఘటన..

ఇన్ని ఆరోపణలు వస్తున్నా అధికారులు ఎందుకు మౌనం వహిస్తున్నారు..?
అసలు ఈ అక్రమాల వెనుక ఎవరి అండ ఉంది..? నాంది న్యూస్‌ ప్రత్యేక కథనంలో…

ఐసీడీఎస్ అంటేనే అవినీతికి కేరాఫ్ అడ్ర‌స్‌గా మారింది. మ‌రీ ముఖ్యంగా మంచిర్యాల జిల్లాలో దారుణ‌మైన ప‌రిస్థితి నెల‌కొంది. అధికారుల నిర్ల‌క్ష్యం.. తూతూ మంత్రంగా ప‌ర్య‌వేక్ష‌ణ వెర‌సి టీచ‌ర్లు ఇష్టారాజ్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. కొంద‌రిపై ప‌దే ప‌దే ఆరోప‌ణ‌లు వ‌స్తున్నా అధికారులు ఎందుకు చ‌ర్య‌లు తీసుకోవ‌డం లేద‌నే విమ‌ర్శ‌లున్నాయి. పై స్థాయి అధికారులు సైతం అవినీతిలో భాగ‌స్వామ్యులు అవుతున్నార‌నే ఫిర్యాదులు సైతం వెల్లువెత్తుతున్నాయి.

మంచిర్యాల జిల్లాలో ఐసీడీఎస్ అక్ర‌మాలకు అంతూపంతూ లేకుండా పోతోంది. మ‌రీ ముఖ్యంగా కొంద‌రు అంగ‌న్‌వాడీ టీచ‌ర్ల విష‌యంలో ఇది చాలా దారుణంగా మారింది. చెన్నూరు ప్రాజెక్టులో జ‌రుగుతున్న తంతు ఇందుకు ఉదాహ‌ర‌ణ‌గా నిలుస్తోంది. దీనికి ఒక్క సెంట‌ర్‌ను చూస్తే చాలు మిగ‌తా చోట్ల ఎలా సాగుతోంద‌ని తెలిసిపోతుంది. కోట‌ప‌ల్లి మండ‌లం న‌క్క‌ల‌ప‌ల్లి 1 అంగ‌న్‌వాడీ సెంట‌ర్‌లో జ‌రిగిన అవ‌క‌త‌వ‌క‌లు చూస్తే మ‌తి పోతుంది. ఇక్క‌డ పెండ్లి మ‌హిళ‌కు పెండ్లి అయిన‌ట్లు… ఆమె గ‌ర్భ‌వ‌తి అయిన‌ట్లు, డెలివరీ సైతం అయిన‌ట్లు రికార్డుల్లోకి ఎక్కించారు.

ఇక బీటెక్ విద్యార్థి వ‌య‌స్సు రెండు సంవ‌త్స‌రాలుగా చూపించారు. ప‌క్క‌నే ఉన్న బ‌ద్దంప‌ల్లి సెంట‌ర్ కు చెందిన ఓ మ‌హిళ‌కు సైతం పెండ్లి కాకున్నా, వాళ్ల చెల్లి కూతురుని పెండ్లి కాని మ‌హిళ కూతురుగా చూపించారు. ఇందులో ఫొటోలో త‌ల్లిది ఉండ‌గా, త‌ల్లి పేరు మాత్రం మార్చేశారు. పాలిక అంజ‌లి అనే గృహిణికి ఇద్ద‌రు పిల్ల‌లు కాగా, అందులో అత‌ని కొడుకు పేరుతో సరుకులు అందిస్తున్న న‌మోదు చేసుకున్న‌ట్లు చెబుతున్నా వారికి ఇప్ప‌టి వ‌ర‌కు ఏం అంద‌లేదు. ఇలా ల‌బ్ధిదారుల పేరిట‌ స‌రుకులు మొత్తం మాయం చేస్తున్నారు.

ఇంత జ‌రుగుతున్నా అధికారుల‌కు క‌నీసం సోయి లేకుండా పోయింది. చెన్నూరు ప్రాజెక్టు ప‌రిధిలో నిత్యం అవినీతి జ‌రుగుతోంద‌ని ఆరోప‌ణ‌లు ఉన్నా… అటు వైపు క‌న్నెత్తి చూడ‌క‌పోవ‌డంలో ఆంత‌ర్యం ఏమిట‌ని ప‌లువురు గ్రామ‌స్తులు ఏకంగా క‌లెక్ట‌ర్ కు ఫిర్యాదు చేయ‌డంతో వ్య‌వ‌హారం బ‌య‌ట‌కు వ‌చ్చింది. దీంతో వెంటనే వ‌చ్చిన సూప‌ర్‌వైజ‌ర్ ఈ విష‌యంపై విచార‌ణ నిర్వ‌హించారు. అయితే, అంగ‌న్‌వాడీ టీచ‌ర్ తెలివిగా వ్య‌వ‌హరించి ల‌బ్ధిదారుల‌కు సంబంధించిన వాటిని డిలీట్ చేసిన‌ట్లు తెలుస్తోంది. దీని వెన‌క ఐసీడీఎస్‌కు చెందిన ఒక‌రు ఆమెకు స‌హ‌క‌రిస్తున్న‌ట్లు తెలుస్తోంది.

ఇదే అంగ‌న్‌వాడీ సెంట‌ర్ కు సంబంధించిన గుడ్లు, పాలు, స‌రుకులు అక్ర‌మంగా ర‌వాణా అవుతంటే సీసీసీ పోలీసులు ప‌ట్టుకున్నారు. కేసు న‌మోదు అయ్యింది. అయితే, ఆ కేసులో టీచ‌ర్‌ను త‌ప్పించేందుకు ఓ నాయ‌కుడు కృషి చేశాడు. ఇప్పుడు సైతం అదే నాయ‌కుడి ద్వారా ఎలాంటి కేసు కాకుండా, ఉన్న‌తాధికారుల‌పై ఒత్తిడి తెచ్చేందుకు ప్ర‌య‌త్నాలు సాగుతున్నాయి. మ‌రి ఆ నాయ‌కుడి మాట‌లు విని విచార‌ణ తొక్కి పెడ‌తారా..? లేక‌పోతే క‌ఠిన చ‌ర్య‌లు తీసుకుంటారా అనేది ప్ర‌శ్నార్థ‌కంగా మారింది. మ‌రోవైపు ఇదే అంశం మంత్రి వివేక్ దృష్టికి సైతం తీసుకుపోవ‌డంతో ఆయ‌న అధికారుల‌ను మంద‌లించిన‌ట్లు స‌మాచారం.

అంగన్‌వాడీ కేంద్రాలు అంటే చిన్నారులు, గర్భిణులు, బాలింతలకు అండగా నిలిచే కేంద్రాలు.

అలాంటి చోట… లబ్ధిదారులే లేకుండా లెక్కలు ఉంటే.. సరుకులు ఇవ్వకుండానే ఇచ్చినట్టు రికార్డులు ఉంటే.. వయసులు తారుమారైతే.. పెళ్లి కాని వారికి పెళ్లిళ్లు జరిగిపోతే.. గర్భాలు, డెలివరీలు కూడా రికార్డుల్లో జరిగిపోతే..

ఇది కేవలం రికార్డుల తప్పిదమా..? లేక పథకాల సరుకులను పక్కదారి పట్టించే పద్ధతిగా మారిందా..?

మరీ ముఖ్యంగా…

ఇన్ని ఆరోపణలు వస్తున్నా చర్యలు ఎందుకు లేవు..? పదేపదే ఆరోపణలు ఎదుర్కొంటున్న వారిపై అధికారులు ఎందుకు కఠినంగా వ్యవహరించడం లేదు..? విచారణను ప్రభావితం చేసేందుకు రాజకీయ ఒత్తిళ్లు నిజంగానే ఉన్నాయా..?

ఇవన్నీ తేలాల్సి ఉంది.

అయితే ఇప్పుడు అందరి చూపు అధికారుల విచారణపైనే. ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై చర్యలు తీసుకుంటారా..? లేక రాజకీయ ఒత్తిళ్ల మధ్య ఈ వ్యవహారం కూడా ఫైళ్లకే పరిమితమవుతుందా..?

మంచిర్యాల ఐసీడీఎస్‌లో ‘రికార్డుల మాయ’కు తెరపడుతుందా..? లేక అక్రమాలకు అంగన్‌వాడీ కేంద్రాలే అడ్డాలుగా మారతాయా..?

ఇదే ఇప్పుడు అసలు ప్రశ్న…

You might also like