22 ఏ భూములపై బీఆర్ఎస్ సమరశంఖం

30 వేల కరపత్రాలతో డోర్ టు డోర్ ప్రచారం

కొమురం భీమ్ ఆసిఫాబాద్ జిల్లాలోని సిర్పూర్ నియోజకవర్గంలో 22ఏ భూముల వివాదం రాజకీయ వేడిని మరింత పెంచుతోంది. నిషేధిత జాబితాలో తమ భూములు చేరడంతో తీవ్ర ఆందోళనలో ఉన్న రైతుల వద్దకు బీఆర్ఎస్ నేతలు నేరుగా వెళ్తున్నారు. మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప సిర్పూర్ కేంద్రంగా తెలంగాణ వ్యాప్తంగా 22ఏ భూముల‌పై పోరాటం కొన‌సాగుతుంద‌ని వెల్ల‌డించారు.

22ఏ భూముల విషయంలో కాంగ్రెస్ ప్రభుత్వాన్ని టార్గెట్ చేస్తూ.. ఏకంగా కరపత్రాల పోరాటానికి దిగారు. బీఆర్ఎస్ హయాంలో భూములను 22ఏలో చేర్చలేదని చెబుతూ.. 2025 అక్టోబర్‌లో వేలాది మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారనడానికి ఆధారాలంటూ కలెక్టర్ ఉత్తర్వులను సైతం కరపత్రాల్లో ముద్రించారు. సుమారు 30 వేల కరపత్రాలతో ఇంటింటి ప్రచారానికి శ్రీకారం చుట్టారు.

రెండు పేజీల ఈ కరపత్రంలో 22ఏ భూముల అంశంపై కాంగ్రెస్ ప్రభుత్వాన్ని బీఆర్ఎస్ నాయకులు ప్రశ్నిస్తున్నారు. బీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో 22ఏ కింద భూములను నిషేధిత జాబితాలో చేర్చలేదని..
2025 అక్టోబర్‌లోనే వేలాది మంది రైతుల భూములను నిషేధిత జాబితాలో చేర్చారని ఆరోపిస్తున్నారు. అందుకు ఆధారాలుగా అప్పటి కలెక్టర్ ఉత్తర్వులను సైతం కరపత్రాల్లో ముద్రించి రైతులకు అందజేస్తున్నారు.

వారు కేవలం కరపత్రాల పంపిణీతోనే ఆగకుండా బాధిత రైతుల ఇళ్లకు వెళ్లి ప్రభుత్వ నిర్ణయాలపై అవగాహన కల్పించే కార్యక్రమాన్ని బీఆర్ఎస్ నేతలు కొనసాగిస్తున్నారు. రైతుల భూములపై ఉన్న నిషేధాన్ని తొలగించాలని.. వారికి న్యాయం చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ఇక ఈ కార్యక్రమంలో భాగంగా నియోజకవర్గంలోని పలు గ్రామాల్లో సుమారు 30 వేల కరపత్రాలను పంపిణీ చేయాలని బీఆర్ఎస్ లక్ష్యంగా పెట్టుకుంది.

ఈ సంద‌ర్భంగా మాజీ ఎమ్మెల్యే కోనేరు కోన‌ప్ప మాట్లాడుతూ కానీ బీఆర్ఎస్ మాత్రం ఇది రాజకీయ అంశం కాదని..వేలాది మంది రైతుల భూములు, వారి భవిష్యత్తుకు సంబంధించిన సమస్య అని చెబుతున్నారు. కలెక్టర్ ఉత్తర్వులను ఆధారాలుగా చూపిస్తున్నామ‌ని… రైతులకు వాస్తవాలను తెలియజేసేందుకే కరపత్రాల ఉద్యమం చేపట్టామని కోన‌ప్ప స్ప‌ష్టం చేశారు.

22ఏ భూములు.. రైతుల భూములకే పరిమితమైన సమస్య కాదు.. ఇప్పుడు సిర్పూర్‌లో రాజకీయ దుమారానికి కేంద్రబిందువుగా మారాయి. ఒకవైపు నిషేధిత జాబితా నుంచి భూములను తొలగించి రైతులకు న్యాయం చేయాలన్న డిమాండ్.. మరోవైపు ఈ అంశాన్ని రాజకీయ అస్త్రంగా మలుచుకుంటున్న బీఆర్ఎస్ వ్యూహం.. 30 వేల కరపత్రాలతో మొదలైన ఈ పోరాటం.. రాబోయే రోజుల్లో తెలంగాణ వ్యాప్తంగా ప్రకంపనలు సృష్టించ‌డం ఖాయ‌మ‌ని ప‌లువురు చెబుతున్నారు.

You might also like