బ్రిక్స్ విందులో మాంసాహారం ఎక్కడ..?
బ్రిక్స్ సదస్సులో పాల్గొన్న దేశాధినేతల కోసం ప్రధాని మోదీ ఏర్పాటు చేసిన గాలా డిన్నర్లో పూర్తిగా వెజ్ వంటకాలను వడ్డించడంపై రాహుల్ గాంధీ స్పందించారు. దేశంలో 80 శాతం మంది నాన్‌వెజిటేరియన్లు అంటూ ట్వీట్ చేశారు. దీంతో కాంగ్రెస్, బీజేపీ నేతల మధ్య మాటల యుద్ధం మొదలైంది. రాహుల్ వ్యాఖ్యలను కేంద్ర మంత్రి కిరణ్ రిజిజు తప్పుబట్టగా.. బ్రిక్స్ డిన్నర్‌పై కాంగ్రెస్ నేతలు ప్రశ్నలు సంధించారు.
భారత్ వేదికగా జరిగిన 18వ బ్రిక్స్ సదస్సు (BRICS Summit) సందర్భంగా కేంద్ర ప్రభుత్వం ఏర్పాటు చేసిన డిన్నర్ మెనూపై కాంగ్రెస్ అగ్రనేత, లోక్‌సభ ప్రతిపక్ష నేత రాహుల్ గాంధీ చేసిన వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయంగా తీవ్ర దుమారం రేపుతున్నాయి. బ్రిక్స్ దేశాల అధినేతల కోసం ఏర్పాటు చేసిన గాలా డిన్నర్లో పూర్తిగా శాకాహార వంటకాలను వడ్డించడాన్ని పరోక్షంగా ప్రస్తావిస్తూ.. దేశంలో 80 శాతం మంది నాన్వెజిటేరియన్లేనని రాహుల్ గాంధీ సోషల్ మీడియా వేదికగా పేర్కొనడం ఇప్పుడు మాటల యుద్ధానికి దారి తీసింది.
ఈ నేపథ్యంలోనే నార్త్ ఇండియన్ ఫేమస్ వంటకమైన చోళే భటూరే ఫొటోను ఎక్స్‌లో షేర్ చేసిన రాహుల్ గాంధీ.. పలు వ్యాఖ్యలు చేశారు. ‘రికార్డు కోసం చెబుతున్నా.. 80 శాతం మంది భారతీయులు నాన్‌వెజిటేరియన్లు. భారతీయ నాన్వెజిటేరియన్ వంటకాలు రుచికరంగా ఉంటాయి. అలాగే నా సోదరి చోళే భటూరే కూడా’ అంటూ రాహుల్ గాంధీ ఆ ట్వీట్లో రాసుకొచ్చారు. బ్రిక్స్ దేశాధినేతల డిన్నర్లో నాన్‌వెజ్ వంటకాలు లేకపోవడంపై జరుగుతున్న చర్చ నేపథ్యంలో రాహుల్ గాంధీ చేసిన ఈ ట్వీట్ ఇప్పుడు ప్రాధాన్యం సంతరించుకుంది.
రాహుల్ గాంధీ వ్యాఖ్యలకు కాంగ్రెస్ పార్టీ అధికార ప్రతినిధి పవన్ ఖేరా మద్దతు తెలిపారు. భారతదేశంలో అనేక రకాల ప్రాంతీయ వంటకాలు ఉన్నాయని.. వాటిలో నాన్వెజిటేరియన్ వంటకాలకు కూడా ప్రత్యేక స్థానం ఉందని అన్నారు. ప్రపంచంలోని ప్రముఖ వంటకాలలో భారతీయ నాన్‌వెజ్ వంటకాలు కూడా ఉన్నాయని పేర్కొంటూ.. విదేశీ అతిథులకు వాటిని ఎందుకు పరిచయం చేయలేదని ప్రశ్నించారు.
అయితే కాంగ్రెస్ విమర్శలపై కేంద్రమంత్రి కిరణ్ రిజిజు తీవ్రంగా స్పందించారు. బ్రిక్స్ దేశాల నేతలకు అందించిన ఫుడ్ మెనూపై కూడా కాంగ్రెస్ పార్టీ రాజకీయాలు చేయడం ఆశ్చర్యంగా ఉందని పేర్కొన్నారు. భారతీయ శాకాహార వంటకాలను విదేశీ నేతలు ఆస్వాదించారని.. దేశంలోని వివిధ ప్రాంతాల ఆహార సంప్రదాయాలు, రుచులు, పోషక విలువలను ప్రతిబింబించేలా విందును ఏర్పాటు చేశామని తెలిపారు.
ప్రధాని నరేంద్ర మోదీ ఆతిథ్యమిచ్చిన ఈ ప్రత్యేక విందులో భారతీయ సంప్రదాయ వంటకాలకు ప్రాధాన్యం ఇచ్చారు. స్టార్టర్స్‌లో కాంద్వీ మిల్లే, ఖుంబ్ గలౌటీ వంటి వంటకాలు ఉన్నాయి. మెయిన్ కోర్సులో పనీర్ లబాబ్దార్, గుచ్చి మార్మిక్, క్యారెట్ బీన్ పొరియల్, థక్కాళి బెల్లే సారు, మిల్లెట్ పులావ్, బీట్రూట్ రాయితా, వివిధ రకాల భారతీయ రొట్టెలను వడ్డించారు.