కోడి పందేల స్థావరంపై పోలీసుల దాడి
కోడిపందేల స్థావరంపై టాస్క్ఫోర్స్, సివిల్ పోలీసులు దాడి చేశారు. రామగుండం కమిషనరేట్ నార్కోటిక్/టాస్క్ఫోర్స్ ఎస్ఐలు రమేష్, లచ్చన్న, ఆర్ ఎస్ ఐ ప్రవీణ్ కుమార్, కన్నెపల్లి ఎస్ ఐ విక్రమ్ పోలీసులతో కలిసి కన్నెపల్లి మండలం చింతపూడి లింగాల గ్రామశివారులో నిర్వహిస్తున్న కోడి పందేల స్థావరంపై దాడి నిర్వహించారు. ఈ సందర్భంగా ఆరుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకున్నారు. వారి వద్ద నుంచి రెండు కోళ్లు,రూ.2,100 నగదు స్వాధీనం చేసుకున్నారు.
పోలీసులు అదుపులోకి తీసుకున్న వారిలో రామ్టెంకి వినోద్, పాలే సుధాకర్, సుదమళ్ల రవి, గట్లే పవన్, బోగే శేఖర్, పాలే అశోక్ ఉన్నారు. అదుపులోకి తీసుకున్న ఆరుగురు వ్యక్తులను, స్వాధీనం చేసుకున్న సామగ్రి నగదుతో సహా తదుపరి చట్టపరమైన చర్యల నిమిత్తం కన్నెపల్లి పోలీస్ స్టేషన్ ఎస్హెచ్ఓకు అప్పగించారు. కోడి పందేలు, జూదం,బెట్టింగ్ వంటి చట్టవిరుద్ధ కార్యకలాపాలకు పాల్పడితే చట్టప్రకారం కఠిన చర్యలు తీసుకుంటామని పోలీసులు హెచ్చరించారు.
కొమురం భీం ఆసిఫాబాద్ జిల్లా చింతలమానపల్లి మండలంలోని గూడెం గ్రామంలో కోడిపుంజులు పందాలు నిర్వహిస్తున్నారన్న సమాచారం మేరకు చింతలమాలపల్లి ఎస్ఐ కమలాకర్ ఆధ్వర్యంలో పోలీసులు మెరుపుదాడి నిర్వహించారు గూడెం గ్రామంలో కోడి పందాలు ఆడుతున్న ఏడుగురు వ్యక్తులను అదుపులోకి తీసుకొన్నారు. పందాల కోసం తీసుకొచ్చిన 5 కోడిపుంజులను 1560 రూపాయలను 2 కత్తులను, మూడు ద్విచక్ర వాహనాలను స్వాధీనం చేసుకున్నట్లు ఎస్ఐ కమలాకర్ తెలిపారు. పట్టుబడిన వ్యక్తులను పోలీస్ స్టేషన్ కు తరలించి కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్ఐ తెలిపారు.