బాల్యం భలే… వినాయకుడు నవ్వే…
వినాయకుడి ముందు... చిన్నారుల సందడి!
వినాయక చవితి అంటేనే అచ్చంగా పిల్లల పండగ…! వినాయకుడి మంటపం కనిపిస్తే చాలు.. వాళ్ల ముఖాల్లో కనిపించే ఆనందం, కళ్లల్లో మెరిసే వెలుగు మాటల్లో చెప్పలేనిది. ఈ ఫొటో చూస్తేనే ఆ చిన్నారుల సంబరం ఎంత ముచ్చటగా ఉందో అర్థమవుతుంది. విద్యార్థులు వినాయకుడి ముందు నుంచి వెళ్తూ.. భక్తితో మొక్కుతూ.. గుంజీలు తీస్తూ కనిపించిన ఈ దృశ్యం శనివారం ఉదయం మంచిర్యాల జిల్లా తాండూరు మండలం మాదారం టౌన్‌షిప్‌లోని ఫ్రెండ్ యూత్ గణేష్ మండలి వినాయక మండపం వద్ద కెమెరాకు చిక్కింది.
ఇంతలో ఓ చిన్నారి గుంజీలు తీస్తుండగా.. “అరేయ్… ఎన్నిరా?” అని అడిగితే.. లెక్క చెప్పాడు. “ఛా… కాదు! మళ్లీ ఫస్ట్ నుంచి తీయాలి…” అంటూ మళ్లీ మొదటి నుంచి గుంజీలు తీయడం మొదలుపెట్టాడు.అసలే చిన్నారులు… ఆపై వినాయకుడంటే అంతులేని భక్తి. వినాయకుడికి ఎంతో ఇష్టమైన గుంజీలు తీస్తున్న ఈ చిన్నారుల ముద్దు భక్తికి ఆ గణనాథుడు మురిసిపోకుండా ఉంటాడా? వారి చిన్న చిన్న కోరికలను వరాలుగా మార్చకుండా ఉంటాడా?
వినాయకుడి ముందు ఆ చిన్నారి గుంజీలు… భక్తికి మించిన ఓ అమాయకమైన బాల్య జ్ఞాపకం!