‘ఎన్నికలకు సిద్ధం అవుతా’..
సుప్రీం తీర్పుపై దానం నాగేందర్
అత్యున్నత న్యాయస్థానం ఇచ్చిన తీర్పును సంపూర్ణంగా గౌరవిస్తున్నానని ఖైరతాబాద్ మాజీ ఎమ్మెల్యే దానం నాగేందర్ తెలిపారు. చట్టపరమైన ప్రక్రియ పట్ల ఉన్న గౌరవంతోనే తాను న్యాయపోరాటం చేశానని చెప్పారు. ఇక తన భవిష్యత్తును ప్రజా క్షేత్రంలోనే తేల్చుకుంటానని స్పష్టం చేశారు. “కోర్టు తీర్పు ఇలా వస్తుందని ముందే ఊహించాను. అయితే రాజ్యాంగంలోని పదో షెడ్యూల్ నిబంధనల ప్రకారం కొంత ఊరట లభిస్తుందని భావించాను. అందుకే చట్టపరంగా చేయాల్సిన ప్రయత్నాలన్నీ చేశాన”ని దానం నాగేందర్ పేర్కొన్నారు.
ఖైరతాబాద్ నియోజకవర్గానికి ఉప ఎన్నిక అనివార్యమైన నేపథ్యంలో తాను సిద్ధంగా ఉన్నట్లు దానం తెలిపారు. ఖైరతాబాద్ ప్రజలతో తనకు దశాబ్దాలుగా అనుబంధం ఉందన్నారు. నియోజకవర్గ ప్రజల కష్టసుఖాల్లో ఎప్పుడూ వారికి అండగా ఉన్నానని చెప్పారు. రాబోయే ఉప ఎన్నికల్లో ప్రజల్లోకి వెళ్లి వారి ఆశీర్వాదం కోరతానన్నారు. ప్రజల మద్దతు తనకే ఉంటుందన్న నమ్మకాన్ని వ్యక్తం చేశారు. 2023 అసెంబ్లీ ఎన్నికల్లో దానం నాగేందర్ బీఆర్‌ఎస్ తరఫున ఖైరతాబాద్ నుంచి ఎమ్మెల్యేగా గెలిచారు. 2024 లోక్‌సభ ఎన్నికల్లో కాంగ్రెస్ తరఫున సికింద్రాబాద్ నుంచి పోటీ చేశారు. దీనిపై దాఖలైన అనర్హత పిటిషన్లపై తెలంగాణ హైకోర్టు ఆయనను ఎమ్మెల్యే పదవికి అనర్హుడిగా ప్రకటించి ఖైరతాబాద్ సీటు ఖాళీ అయినట్లు పేర్కొంది.
ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేస్తూ తెలంగాణ హైకోర్టు ఇచ్చిన తీర్పును సవాల్ చేస్తూ ఆయన దాఖలు చేసిన పిటిషన్‌ను సుప్రీంకోర్టు గురువారం కొట్టివేసింది. సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ సూర్యకాంత్, జస్టిస్ జోయ్‌మాల్య బాగ్చి, జస్టిస్ వి. మోహనతో కూడిన ధర్మాసనం ఈ పిటిషన్‌ను విచారించింది. హైకోర్టు తీర్పులో జోక్యం చేసుకోవాల్సిన కారణాలు కనిపించడం లేదని ధర్మాసనం పేర్కొన్నట్లు సమాచారం.
2024 ఏప్రిల్ 23 నుంచి దానం నాగేందర్ అనర్హుడిగా తెలంగాణ హైకోర్టు ప్రకటించింది. ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీ అయినట్లు ప్రకటించి, తీర్పు ప్రతులను అసెంబ్లీ స్పీకర్, ఎన్నికల సంఘానికి పంపాలని హైకోర్టు ఆదేశించింది. తాజాగా సుప్రీంకోర్టు కూడా హైకోర్టు నిర్ణయంలో జోక్యం చేసుకోకపోవడంతో దానం నాగేందర్ దాఖలు చేసిన న్యాయపోరాటానికి ముగింపు పలికింది.
సుప్రీంకోర్టు హైకోర్టు తీర్పును సమర్థించడంతో ఖైరతాబాద్ అసెంబ్లీ స్థానం ఖాళీగా కొనసాగనుంది. తదుపరి ఎన్నికల ప్రక్రియపై ఎన్నికల సంఘం నిర్ణయం కీలకం కానుంది. దానం నాగేందర్ పిటిషన్‌పై సుప్రీంకోర్టు తీర్పుతో తెలంగాణ రాజకీయాల్లో మరో కీలక పరిణామం చోటుచేసుకుంది.