45 లక్షల టన్నుల బొగ్గు ఏమైంది?..
సింగరేణిపై బాల్క సుమన్ ప్రశ్నల వర్షం
45 లక్షల టన్నుల బొగ్గు ఏమైందని..? బీఆర్ఎస్ జిల్లా అధ్యక్షుడు, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ సింగరేణిని నిలదీశారు. సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్ ను ఆయన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు, నేతలతో కలిసి సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ రెండు యూనిట్లు ఉన్న ప్లాంట్‌లో ప్రస్తుతం ఒక్క యూనిట్ మాత్రమే పనిచేస్తోందని, బొగ్గు సరఫరా లేకపోవడం వల్లే విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోతోందని ఆరోపించారు. 2023లో సింగరేణిలో పుష్కలంగా ఉన్న బొగ్గు నిల్వలు 2025 నాటికి ఒక్కసారిగా ఎలా తగ్గిపోయాయని దుయ్యబట్టారు. సుమారు 45 లక్షల టన్నుల బొగ్గు నిల్వలు ఏమయ్యాయని సుమన్ నిలదీశారు.
బొగ్గు సరఫరా పరిస్థితి, నిల్వలు, విద్యుత్ ఉత్పత్తిపై ప్రభుత్వం పూర్తి వివరాలను ప్రజలకు వెల్లడించాలని డిమాండ్ చేశారు. ప్రస్తుతం దేశవ్యాప్తంగా విద్యుత్ డిమాండ్ పెరగడంతో బొగ్గు సరఫరాపై ఒత్తిడి ఉన్నట్లు అధికారిక, వార్తా నివేదికలు వెల్లడిస్తున్నాయన్నారు. ఆగస్టులో సింగరేణి థర్మల్ పవర్ స్టేషన్లకు భారీగా బొగ్గు సరఫరా చేసినట్లు సింగరేణి తెలిపింది. నాణ్యత, పరిమాణంలో బొగ్గు సరఫరా లోటు ఉందని టీజీ జెన్‌కో కేంద్రాన్ని అదనపు బొగ్గు కోసం కోరినట్లు నివేదికలు వచ్చాయని చెప్పారు.
ప్లాంట్‌లోకి తమను అనుమతించినప్పటికీ.. లోపల జరుగుతున్న పరిస్థితులను పూర్తిగా పరిశీలించేందుకు అవకాశం కల్పించలేదని సుమన్ ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్లాంట్‌లో ఎలాంటి సమస్యలు లేకపోతే పూర్తి వివరాలను ఎందుకు చూపించడం లేదని అధికారులను ప్రశ్నించారు.సింగరేణి సంస్థను కాంగ్రెస్ ప్రభుత్వం నాశనం చేస్తోందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. సింగరేణిలో కేంద్ర ప్రభుత్వానికి 49 శాతం వాటా ఉన్నా బీజేపీ ప్రభుత్వం కూడా సంస్థ పరిస్థితిపై పట్టించుకోవడం లేదని విమర్శించారు. కేసీఆర్ ప్రభుత్వ హయాంలో సింగరేణి థర్మల్ పవర్ ప్లాంట్‌లో వెయ్యి మెగావాట్లకు పైగా విద్యుత్ ఉత్పత్తి జరిగిందని బాల్క సుమన్ పేర్కొన్నారు. ప్రస్తుతం ఉత్పత్తి సుమారు 400 మెగావాట్లకు పరిమితమైందని అన్నారు.
రైతులకు విద్యుత్, సాగునీరు, విత్తనాలు, ఎరువులు అందించడంలో కాంగ్రెస్ ప్రభుత్వం విఫలమైందని బాల్క సుమన్ ఆరోపించారు. రైతులకు విద్యుత్ అందించకుండా ప్రభుత్వం రైతాంగం ఉసురు పోసుకుంటోందంటూ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి తన గురువు చంద్రబాబు నాయుడు చెప్పినట్టుగానే నడుస్తున్నారని బాల్క సుమన్ వ్యాఖ్యానించారు. ప్లాంట్‌లో విద్యుత్ ఉత్పత్తి, బొగ్గు నిల్వలు, సరఫరా పరిస్థితిపై ప్రభుత్వం, సింగరేణి యాజమాన్యం పూర్తి వాస్తవాలను వెల్లడించాలని బీఆర్ఎస్ నేతలు డిమాండ్ చేశారు.