‘‘రాజకీయ సన్యాసం తీసుకుంటా’’..

మంత్రి వివేక్‌కు బాల్క సుమ‌న్ స‌వాల్

రైతుల సమస్యలపై రాజకీయ పోరాటం కొనసాగుతుందని బీఆర్‌ఎస్ నేత, మాజీ ఎమ్మెల్యే బాల్క సుమన్ అన్నారు. రైతులకు సాగునీరు, నిరంతర విద్యుత్ అందించాలన్నదే తమ డిమాండ్ అని స్పష్టం చేశారు. తన వ్యాఖ్యలు వ్యక్తిగత రాజకీయాల కోసం కాదని, రైతుల సమస్యల కోసమేనని చెప్పారు. మంత్రి గడ్డం వివేక్‌ను ఉద్దేశించి బాల్క సుమన్ తీవ్ర వ్యాఖ్యలు చేశారు. ‘‘నీ పోలీసులు లేకుండా.. నీ అనుచరులు, కార్యకర్తలు లేకుండా.. నువ్వే కారు నడుపుకుంటూ వెళ్లి ఎవ‌రైనా ఒక రైతును అడుగు. గతంలో కేసీఆర్ ప్రభుత్వం ఇచ్చినట్లు 24 గంటల కరెంట్ వస్తుందా…? అని అడుగు. ఆ రైతు 24 గంటల కరెంట్ వస్తుందని చెబితే.. నేను ఈ ప్రాంతంలోనే ఉండ‌ను.. రాజకీయ సన్యాసం తీసుకుంటా’’ అంటూ సవాల్ విసిరారు.

‘పదవి రాగానే రైతులను మర్చిపోతారా?’
పదవి, అధికారం వచ్చిన తర్వాత రైతుల సమస్యలను పట్టించుకోకపోవడం సరికాదని బాల్క సుమన్ విమర్శించారు. ‘‘నీకు, నీ కుటుంబానికి పదవులు రాగానే రైతులను మర్చిపోతారా?’’ అని ప్రశ్నించారు. ఎన్నికల్లో ఓట్లు వేసిన ప్రజలను కూడా పాలకులు మర్చిపోకూడదని అన్నారు. తాము చేస్తున్న పోరాటం తమ వ్యక్తిగత ప్రయోజనాల కోసం కాదని, రైతుల కోసం మాత్రమేనని స్పష్టం చేశారు. ‘‘మేం మాట్లాడుతున్నది.. కొట్లాడుతున్నది మా గురించి కాదు. రైతుల గురించి. రైతులకు నీళ్లు రావాలి.. కరెంట్ రావాలి. ఇదే మా డిమాండ్’’ అని బాల్క సుమన్ పేర్కొన్నారు.

‘మూడు గంటలు కరెంట్ లేకుండా ఉండగలవా?’
రైతులు విద్యుత్ సమస్యలతో ఇబ్బందులు పడుతుంటే దానిని రాజకీయ అంశంగా చూడటం సరికాదని బాల్క సుమన్ దుయ్య‌బ‌ట్టారు. ‘‘మూడు గంటలు కరెంట్ లేకుండా ఉంటావా? ఒక్కరోజు మంచినీళ్లు లేకుండా ఉండగలవా?’’ అంటూ ప్రశ్నించారు. రైతుల ఇబ్బందులను అర్థం చేసుకోవాలని, వారి సమస్యలపై ప్రభుత్వం స్పందించాలని కోరారు. తనకు మంత్రి పదవి ఉన్నప్పటికీ ప్రజల సమస్యలపై మౌనంగా ఉండటం సరైన విధానం కాదని వివేక్‌ను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

‘డైవర్షన్ పాలిటిక్స్ అంటూ తప్పించుకోవద్దు’
రైతుల సమస్యలను ప్రస్తావిస్తే వాటిని డైవర్షన్ పాలిటిక్స్‌గా చిత్రీకరించడం సరికాదని బాల్క సుమన్ దుయ్య‌బ‌ట్టారు. రైతుల నుంచి వస్తున్న ఫిర్యాదులు, క్షేత్రస్థాయి సమస్యలపై చర్చ జరగాల్సిందేనని చెప్పారు. తమ పార్టీ నాయకులు కూడా ఇదే అంశాన్ని ప్రస్తావిస్తున్నారని తెలిపారు. తాను వ్యక్తిగతంగా కొత్తగా ఏమీ మాట్లాడటం లేదని, తమ అధినేత కేటీఆర్ కూడా ఒక పత్రికలో ప్రచురితమైన విద్యుత్ సమస్యలకు సంబంధించిన వార్తలను ప్రస్తావించారని చెప్పారు.

‘వెలుగు పత్రికలో వార్తలు  వచ్చాయి..’
విద్యుత్ సమస్యలపై వచ్చిన వార్తలను ప్రస్తావిస్తూ బాల్క సుమన్ మరో ప్రశ్న సంధించారు. ‘‘వెలుగు పత్రిక వివేక్‌దే. అందులోనే విద్యుత్ కష్టాలపై వార్త వచ్చింది. నిజంగానే కరెంట్ కష్టాలు లేకపోతే.. మీ పత్రికలో అలాంటి వార్తలు ఎందుకు రాస్తారు?’’ అని ప్రశ్నించారు. రైతుల పొలాలకు నీరు అందాలంటే విద్యుత్ సరఫరా కీలకమని, విద్యుత్ సమస్యలపై ప్రభుత్వం స్పష్టమైన సమాధానం ఇవ్వాలని డిమాండ్ చేశారు.

 

You might also like