బాలాపూర్ లడ్డూకు రికార్డు ధ‌ర‌.. రూ. 39 లక్ష‌లు

బాలాపూర్ ల‌డ్డూ రికార్డుస్థాయి ధ‌ర ప‌లికింది. అర్భ‌న్ గ్రూప్ చైర్మ‌న్ సామా ప్ర‌ణీత్ రెడ్డి రూ. రూ. 39 లక్ష‌లకు దీనిని ద‌క్కించుకున్నారు. వినాయక ఉత్సవాల్లో ఖైరతాబాద్ గణేశుడి తర్వాత భాగ్యనగరంలో అందరి దృష్టినీ ఆకర్షించేది బాలాపూర్ గణేశుడి లడ్డూ వేలం పాట. అక్కడి గణేశుడి చేతిలో ఉండే 21 కిలోల లడ్డూ వేలం పాట.. ఏటా ప్రపంచం దృష్టిని విశేషంగా ఆకర్షిస్తుంది. ఆ లడ్డూను సొంతం చేసుకుంటే.. సుఖసంతోషాలతో పాటు సిరిసంపదలూ కలుగుతాయని భక్తుల విశ్వాసం. ఈ నేపథ్యంలో లడ్డూను వేలంలో దక్కించుకునేందుకు భక్తులు పెద్దఎత్తున పోటీ పడుతుంటారు.

బాలాపూర్ లడ్డూకు ఘనమైన చరిత్ర ఉంది. 1994లో రూ.450తో ప్రారంభమైన బాలాపూర్‌ లడ్డూ వేలం.. ఏటా రికార్డు స్థాయిలో ధర పలుకుతూ వస్తోంది. అలా 2002లో తొలిసారిగా రూ.1.05 లక్షలు దాటింది. ఆ తర్వాత 2015లో రూ.10.32 లక్షల మార్క్‌నూ చేరుకుంది. 2018లో రూ.16.60 లక్షలు, 2019లో రూ.17.60 లక్షలు పలికింది. కరోనా కారణంగా 2020లో వేలం నిర్వహించలేదు. దీంతో లడ్డూను నాటి సీఎం కేసీఆర్‌కు అందజేశారు. 2021లో రూ.18.90 లక్షలు పలికిన లడ్డూ.. 2022లో రూ.24.60 లక్షలు, 2023లో రూ.27 లక్షలకు ఎగబాకింది. ఇక.. 2024లో రికార్డు స్థాయిలో రూ.30.01 లక్షలకు చేరింది. గతేడాది మరో సరికొత్త రికార్డుతో రూ.35 లక్షలు పలకడం విశేషం. ఈ ఏడాది మరో నాలుగు ల‌క్ష‌లకు అద‌నంగా ఈ వేలం పాట‌లో ద‌క్కించుకున్నారు.

వేలం సొమ్ముతో ఏం చేస్తారంటే?
కాగా.. లడ్డూ వేలం ద్వారా వచ్చిన మొత్తాన్ని ఉత్సవ సమితి.. స్థానిక పనులు, ఆలయాల అభివృద్ధి, సామాజిక సేవా కార్యక్రమాలు వంటి వాటికి ఉపయోగిస్తుంది. బాలాపూర్‌లోని పలు ఆలయాల అభివృద్ధి సహా హైస్కూల్‌లో షెడ్డు, గణేశ్‌ చౌక్‌, సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేశారు. అలాగే.. వినాయక మండపానికి ప్రత్యేకంగా స్థలాన్ని కూడా కొనుగోలు చేశారు.

 

You might also like