వెళ్లిరా తండ్రి… మళ్లీ రా… ఘనంగా ఖైరతాబాద్ గణేషుడి నిమజ్జనం
భక్తల జయజయ ధ్వానాల మధ్య… ఉద్విగ్న క్షణాల మధ్య ఖైరతాబాద్ బడా గణేషుడు ఎట్టకేలకు గంగమ్మ ఒడికి చేరాడు. హైదరాబాద్‌లో ప్రసిద్ధి చెందిన ఖైరతాబాద్ బడా గణేశుడి నిమజ్జన వేడుకలు శుక్రవారం అత్యంత వైభవంగా, కన్నులపండువగా ముగిశాయి.. సాంకేతిక కారణాల వల్ల ఉదయం 6 గంటలకు ప్రారంభం కావాల్సిన శోభాయాత్ర మూడు గంటలు ఆలస్యంగా కదిలింది. వెల్డింగ్ పనులన్నీ పూర్తయిన తర్వాత, బడా గణనాథుడిని ప్రత్యేకంగా సిద్ధం చేసిన టస్కర్ వాహనంపైకి ఘనంగా చేర్చారు. ఎన్టీఆర్ మార్గ్‌లోని క్రేన్ నంబర్ 4 వద్ద హుస్సేన్‌సాగర్‌లో ఈ మహా విగ్రహాన్ని నిమజ్జనం చేశారు. మధ్యాహ్నం 2 గంటలకల్లా నిమజ్జన కార్యక్రమం పూర్తి చేయాలని అధికారులు ఏర్పాట్లు చేశారు. దాదాపుగా అనుకున్న సమయానికే నిమజ్జన మహాక్రతువు పూర్తయ్యింది. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా నగరంలో భారీగా 45 వేల మంది పోలీసులతో పకడ్బందీ భద్రతా ఏర్పాట్లు కల్పించారు.