చిన్నారి కుటుంబానికి రూ. 5 ల‌క్ష‌ల చెక్కు అందజేత

రిమ్స్ ఆసుపత్రిలో సోమ‌వారం అర్ధ‌రాత్రి జరిగిన అగ్ని ప్రమాదంలో మృతి చెందిన మూలగూడ గ్రామానికి చెందిన చిన్నారి కుటుంబాన్ని ఐటీడీఏ ప్రాజెక్టు అధికారి మంద మకరందు శుక్రవారం పరామర్శించారు. ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం మూలగూడ గ్రామానికి చేరుకున్న ప్రాజెక్టు అధికారి, చిన్నారి తల్లిదండ్రులను కలిసి ఘటనకు సంబంధించిన వివరాలను అడిగి తెలుసుకున్నారు.

ఈ సందర్భంగా చిన్నారి మృతి పట్ల ప్రాజెక్టు అధికారి తీవ్ర విచారం వ్యక్తం చేశారు. చిన్నారి కుటుంబ సభ్యులను పరామర్శించి, వారికి ప్రభుత్వం అండగా ఉంటుందని భరోసా కల్పించారు. ఆపద సమయంలో బాధిత కుటుంబానికి అవసరమైన సహాయ సహకారాలు అందించేందుకు ప్రభుత్వం చర్యలు తీసుకుంటుందన్నారు. బాధిత కుటుంబానికి తెలంగాణ ప్రభుత్వం తరఫున మంజూరైన రూ.5 లక్షల ఆర్థిక సహాయానికి సంబంధించిన చెక్కును ప్రాజెక్టు అధికారి చిన్నారి తల్లిదండ్రులకు అందజేశారు. ప్రభుత్వం తరఫున అందుతున్న ఆర్థిక సహాయాన్ని కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని సూచించారు.

బాధిత కుటుంబ పరిస్థితిని అధికారులు సైతం పరిశీలించి, వారికి అందాల్సిన ప్రభుత్వ సహాయ కార్యక్రమాలు, సంక్షేమ పథకాలపై అవసరమైన చర్యలు తీసుకోవాలని ప్రాజెక్టు అధికారి సంబంధిత అధికారులను సూచించారు. కుటుంబానికి ప్రభుత్వ పరంగా అందాల్సిన సహాయాన్ని నిబంధనల ప్రకారం అందించేందుకు అధికారులు సమన్వయంతో పనిచేయాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో ఏపీఓ పీవీటీవీ ఆత్రం భాస్కర్ , ఎంపీడీఓ, మండల వ్యవసాయ అధికారి, ఏఈ (హౌసింగ్) తదితర అధికారులు పాల్గొన్నారు.

You might also like