అటవీ భూముల వివాదం… గిరిజనుడిపై దాడి ఆరోపణ
మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం కొత్తపల్లి రాజారాం రైతులను అటవీ భూముల్లోకి వెళ్లకుండా అటవీ శాఖ అధికారులు అడ్డుకున్నారు. అటవీ భూమిలో పట్టు పురుగుల సాగు (సెరికల్చర్) చేసుకుంటున్న గిరిజనులను వెళ్లకుండా అడ్డుకోవడంతో ఘర్షణ వాతావరణం చోటు చేసుకుంది. ఈ సందర్భంగా అటవీశాఖ సిబ్బంది గిరిజనుడైన చింతల లస్మయ్యపై దాడి చేశారని ఆదివాసీలు ఆరోపించారు. ఈ ఘటనలో లస్మయ్య స్పృహ తప్పి పడిపోయారు. అపస్మారక స్థితిలో ఉన్న లస్మయ్యను చెన్నూరు ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. తరతరాలుగా సాగు చేసుకుంటున్న భూముల్లో అటవీ అధికారులు దౌర్జన్యాలకు పాల్పడుతున్నారని గిరిజన సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దాడికి పాల్పడిన అటవీశాఖ అధికారులను వెంటనే సస్పెండ్ చేసి వారిపై ఎస్టీ అట్రాసిటీ కేసు నమోదు చేయాలని వారు డిమాండ్ చేశారు.