నక్సలైట్లు లేరనే అటవీ అధికారుల పెత్తనం
అటవీ శాఖ అధికారుల తీరుపై ఆసిఫాబాద్ ఎమ్మెల్యే కోవ లక్ష్మి ఫైర్
“నక్సలిజం అంతం కావడంతో అటవీ ప్రాంతాల్లో అధికారుల ఆగడాలకు అడ్డూ అదుపూ లేకుండా పోతోంది. ఒకప్పుడు నక్సలైట్లు ఉన్నప్పుడు అడవిలోకి అడుగుపెట్టడానికే వణికిపోయిన అధికారులు.. నేడు అమాయక ఆదివాసీలను ఇబ్బందులకు గురిచేస్తున్నారంటూ ఆసిఫాబాద్ ఎమ్మెల్యే సంచలన వ్యాఖ్యలు చేశారు. ఏజెన్సీలో మనుషుల కంటే జంతువులకే ఎక్కువ విలువ ఇస్తున్నారంటూ ప్రభుత్వ తీరుపై ఆమె తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. నిధుల కేటాయింపులో ఆసిఫాబాద్ పై చూపుతున్న వివక్షను సభాముఖంగా నిలదీశారు.
అధికారుల తీరుపై ఫైర్
అడవులను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న ఆదివాసీలపై అటవీ శాఖ అధికారుల వేధింపులు శృతిమించుతున్నాయని ఆసిఫాబాద్ ఎమ్మెల్యే మండిపడ్డారు. “నక్సలిజం లేదు కాబట్టే అధికారులు విచ్చలవిడిగా ప్రవర్తిస్తున్నారు. అదే నక్సలైట్లు ఉన్నప్పుడు ఏ ఒక్క ఫారెస్ట్ అధికారైనా అడవుల్లోకి వెళ్లారా?” అని ఆమె సభికులను ప్రశ్నించగా.. జనం అంతా ‘అవును’ అంటూ ముక్తకంఠంతో మద్దతు పలకడం గమనార్హం.
అభివృద్ధికి అడుగడుగునా ఆటంకాలు
అటవీ ప్రాంతాల్లో కనీస మౌలిక సదుపాయాలు లేక ప్రజలు తీవ్ర అవస్థలు పడుతున్నారని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు. ప్రసిద్ధ జంగూబాయి దేవస్థానానికి మహారాష్ట్ర ప్రభుత్వం బీటీ రోడ్డు, బ్రిడ్జి నిర్మిస్తే.. తెలంగాణలో ఆసిఫాబాద్ నుంచి రోడ్డు మంజూరైనా అటవీ అధికారులు అడ్డుకుంటున్నారని మండిపడ్డారు. “మహారాష్ట్రకు ఒక జీవో.. తెలంగాణకు ఒక జీవో ఉంటుందా?” అని నిలదీశారు. రోడ్లు లేకపోవడంతో వర్షాకాలంలో గర్భిణులను మంచాలపై మోసుకెళ్లాల్సిన దుస్థితి నెలకొందని, మంగి, గుండాల లాంటి ప్రాంతాలకు కనీస దారి లేనప్పుడు ఆ ప్రజలను వేరే ఎక్కడికైనా తరలిద్దామా? అని ప్రశ్నించారు.
నిధుల కేటాయింపులో పక్షపాతం
ఆసిఫాబాద్ జిల్లాపై తీవ్ర వివక్ష కొనసాగుతోందని ఆమె ఆరోపించారు. అత్యధిక గిరిజన జనాభా ఉన్న ఆసిఫాబాద్‌కు గిరిజన సంక్షేమ నిధుల కింద కేవలం రూ. 9 కోట్లు ఇచ్చి, గిరిజన జనాభా తక్కువగా ఉన్న మంచిర్యాలకు రూ. 25 కోట్లు ఇవ్వడం ఏ రకమైన న్యాయమని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. అడవి పంది చనిపోతే రూ. 3 లక్షలు ఫైన్ వేస్తున్న అటవీ అధికారులు.. ఎలుగుబంటి దాడిలో గాయపడి ఆసుపత్రి పాలైన గిరిజనుడికి మాత్రం ఇప్పటికీ నష్టపరిహారం ఇవ్వలేదని, మనుషుల కంటే జంతువులకే ఎక్కువ విలువ ఇస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మంత్రులకు విజ్ఞప్తి
ప్రజలకు సేవ చేయలేనప్పుడు మంత్రి పదవులు ఎందుకని ఘాటుగా ప్రశ్నించిన ఆమె.. అదే సమయంలో మంత్రులు సీతక్క, అడ్లూరి లక్ష్మణ్ లపై తనకెలాంటి వ్యతిరేకత లేదని స్పష్టం చేశారు. కరోనా విపత్కర సమయంలో నాటి సీఎం కేసీఆర్ ప్రజలను ఎలాగైతే ఆదుకున్నారో, ప్రస్తుత కరువు పరిస్థితుల్లో తాగునీటి కోసం ఇక్కడి ప్రజలకు ప్రత్యేక నిధులు మంజూరు చేసి ఆదుకోవాలని పంచాయతీరాజ్ శాఖ మంత్రి సీతక్కకు ఆమె విజ్ఞప్తి చేశారు. ఇది విమర్శ కాదని, తమ ప్రాంతానికి నిధులు రావాలన్నదే తన తపన అని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.