పులి దాడిలో అంగన్వాడీ టీచర్ మృతి..
పులి దాడిలో ఓ అంగన్వాడీ టీచర్ మృతి చెందిన ఘటన కలకలం సృష్టించింది. ఆమెను ప్రమీలా పుండలిక్ మహాడోరే (50)గా గుర్తించారు. ఆమె భెండాళాలో అంగన్వాడీ టీచర్‌గా పనిచేస్తున్నారు.
వివరాల్లోకి వెళ్తే.. ఆదివారం సెలవు కావడంతో మధ్యాహ్నం సమయంలో ప్రమీలా మహాడోరే తన సొంత పొలంలో నువ్వుల పంట కోసేందుకు వెళ్లారు. ఆమె పొలంలో పంట కోస్తుండగా, సమీపంలో మాటువేసి ఉన్న పులి ఒక్కసారిగా దాడి చేసింది. ఈ దాడిలో తీవ్రంగా గాయపడిన ఆమె అక్కడికక్కడే మృతి చెందారు.
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో సిందేవాహి తాలూకాలోని భెండాళా గ్రామంలో ఈ ఘటన చోటు చేసుకుంది. ఈ ఘటనతో భెండాళా గ్రామంతో పాటు పరిసర ప్రాంతాల్లో విషాదం నెలకొంది. పొలాల్లో వ్యవసాయ పనులు చేసేందుకు వెళ్తున్న రైతులు, కూలీలు తీవ్ర భయాందోళనకు గురవుతున్నారు.
సమాచారం అందుకున్న అటవీశాఖ అధికారులు, పోలీసులు వెంటనే ఘటనాస్థలానికి చేరుకున్నారు. ఘటనకు సంబంధించిన వివరాలను సేకరించి, తదుపరి చర్యలు చేపట్టారు.
అటవీ ప్రాంతాలకు సమీపంలోని పొలాల్లో పులుల సంచారం పెరుగుతుండటంతో రైతులు, వ్యవసాయ కూలీల భద్రతపై ఆందోళన వ్యక్తమవుతోంది. పంటల పనుల కోసం పొలాలకు వెళ్లే వారు అప్రమత్తంగా ఉండాల్సిన పరిస్థితి నెలకొంది. అటవీశాఖ అధికారులు పులి సంచారంపై నిఘా పెంచి, గ్రామీణ ప్రాంత ప్రజల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని స్థానికులు కోరుతున్నారు.