పక్కనే గోదావరి.. క్యాంపస్‌ ఎడారి… యూనివర్సిటీ నిర్లక్ష్యంపై విద్యార్థుల కన్నెర్ర

-యూనివర్సిటీలో నీటి కష్టాలు.. మోటార్లు రిపేర్ చేయలేక ప్రకృతిపై నెపం
-యాజమాన్యం నిర్లక్ష్యంపై భగ్గుమన్న తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS)
-అకడమిక్ షెడ్యూల్ అస్తవ్యస్తం.. ఒకేసారి ఎండ్ సెమిస్టర్ పరీక్షలా అంటూ విద్యార్థుల ఆగ్రహం

బాస‌ర ట్రిపుల్ ఐటీ యూనివర్సిటీలో నీటి ఎద్దడిపై విద్యార్థి సంఘం ‘టీఎస్ఏఎస్’ (TSAS) తీవ్ర స్థాయిలో మండిపడింది. పక్కనే గోదావరి నదిలో నీళ్లున్నా.. యూనివర్సిటీకి మాత్రం నీరు రావడం లేదని, ఇందుకు యాజమాన్యం చేతగానితనమే కారణమని విద్యార్థులు ఆరోపిస్తున్నారు. పాడైన మోటార్లను బాగు చేయించాల్సింది పోయి, ‘ఎల్ నినో’ వల్ల నీళ్లు రావడం లేదంటూ ప్రకృతిపై నెపం నెట్టడాన్ని తీవ్రంగా తప్పుబడుతున్నారు. యాజమాన్యం నిర్లక్ష్యానికి విద్యార్థుల భవిష్యత్తును బలిచేయొద్దంటూ హెచ్చరిస్తున్నారు.

యూనివర్సిటీలో అసలు సమస్య నీళ్లు లేకపోవడం కాదు.. బాధ్యత తీసుకునే నాథుడే కరువవ్వడం అని తెలంగాణ స్టూడెంట్స్ అసోసియేషన్ ఫర్ సాలిడారిటీ (TSAS) ఆరోపించింది. ఇన్‌టేక్ వద్ద ఉన్న మూడు మోటార్లు చెడిపోవడమే ప్రస్తుత నీటి కష్టాలకు ప్రధాన కారణమని తెలిపింది. మోటార్లను రిపేర్ చేయించడంలో విఫలమైన యాజమాన్యం.. ఆ తప్పును కప్పిపుచ్చుకునేందుకు ఎల్ నినో (El Nino)ను సాకుగా చూపుతోందని విద్యార్థులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

నీళ్ల సమస్య పేరుతో సెలవులు పొడిగించి.. ఆన్‌లైన్ క్లాసులతో అకడమిక్ షెడ్యూల్‌ను పూర్తిగా అస్తవ్యస్తం చేశారని టీఎస్ఏఎస్ మండిపడుతోంది. ఎలాంటి సమయం ఇవ్వకుండా.. ఇప్పుడు ఏకంగా MT-2, MT-3, ఎండ్ సెమిస్టర్ పరీక్షలను ఒకేసారి విద్యార్థుల మీద రుద్దడం ఏంటని నిలదీస్తోంది. ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాల్సిన బాధ్యత యూనివర్సిటీదేనని, సాకులు చెప్పి చేతులు దులుపుకుంటే చూస్తూ ఊరుకోబోమని స్పష్టం చేసింది.

ఈ క్రమంలో TSAS యాజమాన్యం ముందు ప్రధాన డిమాండ్లను ఉంచింది:

-మోటార్ల వైఫల్యం, రిపేర్ల ఆలస్యంపై తక్షణమే పూర్తి ‘టెక్నికల్ రిపోర్ట్’ను బయటపెట్టాలి.
-క్యాంపస్‌కు శాశ్వత నీటి సరఫరాను ఎప్పటిలోగా పునరుద్ధరిస్తారో స్పష్టమైన ‘టైమ్ లైన్’ ప్రకటించాలి.
-విద్యార్థులు నష్టపోకుండా.. వారికి తగిన ప్రిపరేషన్ సమయం దొరికేలా పరీక్షల షెడ్యూల్‌ను సవరించాలి.
-విద్యార్థి ప్రతినిధులతో అధికారికంగా చర్చలు జరపాలి.
-విద్యార్థులకు న్యాయం జరిగే వరకూ అధికారికంగా, ఆధారాలతో పోరాటం కొనసాగిస్తామని టీఎస్ఏఎస్ (TSAS) స్పష్టం చేసింది.

You might also like