శాంతి భద్రతలు పరిరక్షించండి
మంచిర్యాల నియోజవర్గంలో కాంగ్రెస్ లో గ్రూప్ గొడవలు అరికట్టి శాంతి భద్రతలు పరిరక్షించాలని బీజేపీ నేతలు కోరారు. MLC అంజి రెడ్డి, బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షులు వెరబెల్లి రఘునాథ్, మున్సిపల్ కార్పొరేషన్ ఫ్లోర్ లీడర్ గాజుల ముఖేష్ గౌడ్ కాళేశ్వరం మల్టీ జోన్ -1 ఐజీని కలిసి వినతి పత్రం అందించారు. కొద్ది రోజులుగా మంచిర్యాల కాంగ్రెస్ MLA, జిల్లా మంత్రి వర్గాలుగా ఏర్పడి మంచిర్యాల నియోజకవర్గంలో గ్యాంగ్ వార్ లు, గొడవలతో అలజడులు సృష్టిస్తున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. వారు ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తూ శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తున్నారని అన్నారు.
బతుకమ్మ పండుగ రోజు దండేపల్లి మండలం తాళ్ళపేటలో జరిగిన గొడవ, దసరా రోజున లింగాపూర్ లో జరిగిన ఘటన, మంచిర్యాల జిల్లాలో పోలీస్ పహారాను పెంచి ప్రజలను భయభ్రాంతులకు గురి చేయడం, లక్ష్సెట్టిపేట మండలం వెంకట్రావుపేట ఘటన వంటి అంశాలపై సమగ్ర విచారణ జరపాలన్నారు. ఈ మేరకు బాధ్యుల పై చర్యలు తీసుకోవాలని వారు డిమాండ్ చేశారు. మరోసారి ఇలాంటి ఘటనలు పునరావృతం కాకుండా చర్యలు తీసుకోవాలని కోరారు.