తుమ్మ‌డిహెట్టి పేరుతో డైవ‌ర్ష‌న్ పాలిటిక్స్

-రైతుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నారు..
-ఇది కాలం తెచ్చిన కరువు కాదు.. కాంగ్రెస్ తెచ్చిన కరువు!
-రోమ్ తగలబడుతుంటే నీరో చక్రవర్తి ఫిడేలు వాయించినట్లు రేవంత్ రెడ్డి తీరు
-దమ్ముంటే తుమ్మిడిహట్టి డీపీఆర్ బయటపెట్టాలి
-కాంగ్రెస్, బీజేపీ కుమ్మక్కు రాజకీయాలు..
-తెలంగాణ భవన్ లో మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్‌ ఫైర్

రాష్ట్రంలో నెలకొన్న సాగునీటి ఎద్దడి, కరెంట్ కోతలపై తెలంగాణ భవన్ వేదికగా మాజీ ఎమ్మెల్యే బాల్క సుమ‌న్ నిప్పులు చెరిగారు. చేతకాని, అసమర్థ పాలనతో కాంగ్రెస్ పార్టీ రాష్ట్రానికి కరువును తీసుకొచ్చిందని మండిపడ్డారు. మహారాష్ట్ర ప్రభుత్వంతో చర్చల పేరిట సీఎం రేవంత్ రెడ్డి నాటకాలకు తెరలేపారని విమర్శించారు.

ఉన్న నీటిని వ‌దిలేసి బ్యారేజీ క‌డ‌తారా..?
తెలంగాణలో రైతాంగం కరెంట్, నీళ్లు లేక అల్లాడుతుంటే.. ముఖ్యమంత్రి, మంత్రులు మహారాష్ట్ర వెళ్లి ఏదో ఘనకార్యం సాధించినట్లు బిల్డప్ ఇస్తున్నారని బాల్క సుమ‌న్‌ ఎద్దేవా చేశారు. ఉన్న నీటిని కిందకు వదిలేసి, ఇప్పుడు తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కడతామనడం ప్రజల దృష్టిని మళ్లించడమే అన్నారు. త‌న చెన్నూరు నియోజకవర్గంలో కరెంట్ రాక, రైతులు ట్యాంకర్లతో వరి పంటకు నీళ్లు పోసుకునే దౌర్భాగ్య పరిస్థితి దాపురించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇది కాలం తెచ్చిన కరువు కాదని, కాంగ్రెస్ తెచ్చిన కరువని విమర్శించారు.

రైతుల‌ను భ‌య‌బ్రాంతుల‌కు గురిచేస్తున్నారు..
పాలమూరు-రంగారెడ్డి లిఫ్టులు ఆన్ చేస్తే జిల్లాలకు నీళ్లు వచ్చేవని, కానీ ప్రభుత్వం చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లు వ్యవహరిస్తోందని మండిపడ్డారు. ఒకపక్క సీడ్ షాపులకు వరి విత్తనాలు అమ్మొద్దని నోటీసులు ఇస్తూ.. మరోపక్క విత్తనాలు కొనే రైతులను సెల్ఫ్ డిక్లరేషన్ పేరుతో భయభ్రాంతులకు గురిచేయడం ప్రభుత్వ దుర్మార్గపు ఆలోచనలకు నిదర్శనమన్నారు. కరోనా లాంటి విపత్కర సమయంలో కేసీఆర్ ప్రజలకు భరోసా ఇస్తే, రేవంత్ రెడ్డి మాత్రం సెల్ఫ్ డిక్లరేషన్ల పేరుతో రైతులను భయపెడుతున్నారని అన్నారు.

తుమ్మ‌డిహెట్టి డీపీఆర్ బయ‌ట‌పెట్టాలి..
తుమ్మిడిహట్టి దగ్గర బ్యారేజ్ కట్టి తూర్పు ఆదిలాబాద్ కు నీళ్లు ఇస్తామంటున్న ప్రభుత్వం.. అక్కడ నీటి లభ్యత లేదని సీడబ్ల్యూసీ చెప్పిన విషయాన్ని ఎందుకు మర్చిపోయిందని బాల్క సుమ‌న్‌ ప్రశ్నించారు. ఒకవేళ కడితే.. ఎన్ని ఎకరాలకు నీళ్లు వస్తాయి..? ఎంత ఖర్చు అవుతుంది..? దానికి సంబంధించిన డీపీఆర్ (DPR) ను వెంటనే బయటపెట్టాలని డిమాండ్ చేశారు. కన్నెపల్లి నుంచి నీళ్లు ఎత్తిపోయకుండా కిందకు వదిలేశారని, సీతారామ, దేవాదుల ద్వారా ఎన్ని మోటార్లు ఆన్ చేశారు? ఎన్ని నీళ్లు లిఫ్ట్ చేశారో మాజీ మంత్రి హరీష్ రావు అడిగిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పాలని సుమ‌న్ డిమాండ్ చేశారు.

కాంగ్రెస్‌, బీజేపీ డ్రామాలు..
కాంగ్రెస్, బీజేపీ రెండు పార్టీలు తెలంగాణలో డ్రామాలు ఆడుతున్నాయని బీఆర్ఎస్ నేతలు తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. మేడిగడ్డ విషయంలో ఆగమేఘాల మీద ఎన్డీఎస్ఏ (NDSA) రిపోర్ట్ తెప్పించిన బీజేపీ.. రిపేర్ల విషయంలో ఎందుకు మాట్లాడటం లేదన్నారు. రెండు పార్టీలు ఒకరికొకరు అలైబలై చేసుకుంటూ రాష్ట్రాన్ని పడావు పెడుతున్నారని దుయ్యబట్టారు. కాంగ్రెస్ నేతలు కనీసం సెక్యూరిటీ లేకుండా రైతుల వద్దకు వెళ్లే ధైర్యం ఉందా అని సవాల్ విసిరారు. పాలన గాలికి వదిలేసి కేటీఆర్, హరీష్ రావులను తిట్టడమే మంత్రులు, ఎమ్మెల్యేలు పనిగా పెట్టుకున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. సొంత పార్టీ ఎమ్మెల్యేలే నిధులు, నీళ్లు ఇవ్వడం లేదని వాపోతున్నారంటే.. ప‌రిస్థితి అర్థం చేసుకోవ‌చ్చ‌న్నారు. ఈ స‌మావేశంలో ఆయ‌న‌తో పాటు బీఆర్ఎస్ నేతలు కిషోర్ గౌడ్, గెల్లు శ్రీనివాస్, కురువ విజయ్ కుమార్ పాల్గొన్నారు.

You might also like