మంచిర్యాల, దండేపల్లి ఘటనలపై సిట్ ఏర్పాటు

మంచిర్యాల, దండేపల్లిలో కాంగ్రెస్ వ‌ర్గ‌పోరులో ఇటీవల చోటుచేసుకున్న ఘటనలపై పోలీసు శాఖ కీలక నిర్ణయం తీసుకుంది. ఈ ఘటనల వెనుక ఉన్న వాస్తవాలను వెలికితీసేందుకు రామగుండం పోలీస్ కమిషనర్ అంబర్ కిషోర్ ఝా.. సీసీఎస్ ఏసీపీ నేతృత్వంలో ఒక ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని (SIT) ఏర్పాటు చేశారు. పారదర్శకంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరగాలని ఆదేశించారు.

మంచిర్యాల, దండేపల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో ఇటీవల జరిగిన ఘటనలపై పోలీస్ శాఖ సీరియస్ గా దృష్టి సారించింది. రామగుండం సీపీ అంబర్ కిషోర్ ఝా ఆదేశాల మేరకు ఏర్పాటైన ప్రత్యేక దర్యాప్తు బృందం.. క్షేత్రస్థాయిలో విచారణను వేగవంతం చేయనుంది. నేరుగా సంఘటన స్థలాలను పరిశీలించి, సాక్షులను విచారించడంతో పాటు.. టెక్నికల్ డేటా, సాంకేతిక ఆధారాలను ఈ బృందం సేకరించనుంది. లభించిన పక్కా ఆధారాలతో, ఎవరి ఒత్తిళ్లకు తలొగ్గకుండా నిందితుల పాత్రను నిర్ధారించేలా ఈ దర్యాప్తు సాగనుంది.

మరోవైపు ఈ రెండు పోలీస్ స్టేషన్ల పరిధిలో శాంతిభద్రతలకు విఘాతం కలగకుండా పోలీసులు 24 గంటల పాటు హై అలర్ట్ ప్రకటించారు. ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ముందస్తు భద్రతా చర్యలు చేపట్టారు. సోషల్ మీడియాలో కొందరు పనిగట్టుకుని అసత్యాలను, ఊహాజనిత వార్తలను ప్రచారం చేస్తున్నారని.. అలాంటి పుకార్లను నమ్మి ఆందోళన చెందవద్దని సీపీ అంబర్ కిషోర్ ఝా ప్రజలకు విజ్ఞప్తి చేశారు. కేవలం పోలీస్ శాఖ అధికారికంగా విడుదల చేసే సమాచారాన్ని మాత్రమే విశ్వసించాలని కోరారు. ప్రజల భద్రతే తమ ప్రథమ ప్రాధాన్యతని ఆయన స్పష్టం చేశారు.

You might also like