నవంబర్ 5న సింగరేణి ఉద్యోగులకు దీపావళి బోనస్

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వెల్లడి
ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చెల్లింపు
దీపావళి బోనస్ గా దాదాపు రూ. 419 కోట్లు చెల్లింపు
దాదాపు 38 వేల మంది కార్మికులకు అందనున్న బోనస్

సింగరేణి కార్మికులకు నవంబర్ 5వ తేదీన దీపావళి బోనస్ అందించ‌నున్నారు. ఈ మేర‌కు రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విష‌యాన్ని వెల్ల‌డించారు. సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలుపుతూ పెర్ఫార్మెన్స్ లింక్డ్ రివార్డ్ బోనస్ (దీపావళి బోనస్) ను నవంబర్ 5న చెల్లించాల్సిందిగా సింగరేణి యాజమాన్యాన్ని ఆదేశించారు. దీపావళి బోనస్ గా రూ. 419 కోట్లను చెల్లించనున్నట్లు చెప్పారు. ఒక్కో కార్మికుడికి గరిష్టంగా రూ.1,10,250 చొప్పున దీపావళి బోనస్ అందుతుంద‌న్నారు.

రాష్ట్రానికి వెలుగులు పంచుతున్న సింగరేణి సంస్థ అభివృద్ధి విస్తరణకు ప్రజా ప్రభుత్వం ప్రణాళికాబద్ధంగా ప్రయత్నిస్తోందని పేర్కొన్నారు. లాభాల వాటా కింద ఈ నెలలో దాదాపు 600 కోట్ల రూపాయలు చెల్లించగా.. తాజాగా రూ.419 కోట్ల దీపావళి బోనస్ చెల్లించనున్నట్లు తెలిపారు. బొగ్గు రంగంలో పోటీని అధిగమించేందుకు బొగ్గు ఉత్పత్తి వ్యయాన్ని తగ్గించే ప్రయత్నం చేయాలన్నారు.

రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి ఆదేశాలపై సింగరేణి సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సంబంధిత పర్సనల్, ఫైనాన్సు అధికారులతో మాట్లాడి నవంబర్ 5న దీపావళి బోనస్ కార్మికుల బ్యాంకు ఖాతాల్లో చెల్లింపునకు తగిన ఏర్పాటు చేయాలని ఆదేశించారు. ఈ బోనస్ కేవలం ఎన్.సీ.డబ్ల్యూ.ఎ (NCWA) ఉద్యోగులకు మాత్రమే వర్తిస్తుంది. ఇది అధికారులకు వర్తించదు. గత ఆర్థిక సంవత్సరంలో భూగర్భ గనుల విభాగంలో 190 పని దినాలు, ఓపెన్ కాస్ట్, స‌ర్ఫేస్ విభాగాల్లో 240 పని దినాలు పూర్తి చేసిన కార్మికులకు పూర్తిస్థాయిలో బోనస్ అందుతుంది.

అంతకంటే తక్కువ పని దినాల హాజరు ఉన్న‌వారు పని చేసిన కాలానికి నిష్పత్తి ప్రకారం బోనస్ లెక్క కట్టి చెల్లించనున్నారు. అయితే ఈ బోనస్ పొందడానికి కనీస అర్హతగా గత ఆర్థిక సంవత్సరంలో ఏ కార్మికుడైనా కనీసం 30 రోజులు పని చేసి ఉండాలని నిర్ణయించారు. మొత్తం మీద చూస్తే సుమారు 38,000 మంది ఉద్యోగులకు ఈ బోనస్ వర్తించనుంది. సింగ‌రేణి సంస్థ సీఎండీ డాక్టర్ బుద్ధప్రకాష్ జ్యోతి సింగరేణి ఉద్యోగులకు దీపావళి శుభాకాంక్షలు తెలిపారు. కార్మికులు బోనస్ ల సొమ్మును తమ కుటుంబ అవసరాలకు వినియోగించుకోవాలని, అవకాశం ఉంటే పొదుపు చేసుకోవాలని సూచించారు. ప్రతీ ఒక్కరూ పండుగల స్ఫూర్తితో ఉత్సాహంగా పనిచేయాలని గనుల వారీగా, శాఖల వారీగా నిర్దేశించిన లక్ష్యాలు సాధించాలని కోరారు.

You might also like