ఏం మొహం పెట్టుకుని.. ఆదిలాబాద్ వస్తున్నరు..?
ఉమ్మడి ఆదిలాబాద్ అభివృద్దిని పట్టించుకోకుండా, ఇక్కడి ప్రజలను మోసం చేసి ఏం మొహం పెట్టుకుని బీఆర్ఎస్ ఇక్కడ రైతు గర్జన పేరుతో సభ పెడుతుందని తెలంగాణ రక్షణ సేన పార్టీ చీఫ్ కల్వకుంట్ల కవిత ప్రశ్నించారు. ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లిలో జరిగిన ‘పాంచజన్య సంకల్ప సభ’లో కేటీఆర్, అప్పటి బీఆర్ఎస్ ప్రభుత్వంపై దుమ్మెత్తిపోశారు. ఆదిలాబాద్ జిల్లాలో ఎకరం నీళ్లు ఇవ్వని బీఆర్ఎస్ నేతలు.. ఏ మొఖం పెట్టుకుని ఇక్కడకు వస్తారని పరోక్షంగా కేటీఆర్‌పై విమర్శలు గుప్పించారు. చనఖా – కొరటా ప్రాజెక్ట్ ను 368 కోట్ల నుంచి రూ. 2100 కోట్ల పెంచి భారీ అవినీతికి పాల్పడ్డారని దుయ్యబట్టారు. ఈ సొమ్ము గుంటనక్క మింగిందా..? అంటూ హరీష్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు. లేకపోతే బీఆర్ఎస్ ఖాతాలో చేరిందా సమాధానం చెప్పాలన్నారు. బీఆర్ఎస్ పార్టీ ఇక్కడ గర్జన సభ పెడుతుందంట. వాళ్లది గర్జన కాదు తర్జన భర్జన అంటూ కవిత ఎద్దేవా చేశారు.
రైతు గర్జన పేరుతో ఆదిలాబాద్ కు వస్తున్న కేటీఆర్ ను నేను కొన్ని ప్రశ్నలు అడుగుతున్న సమాధానాలు చెప్పాలన్నారు. అధికారంలోకి వస్తే ఆదిలాబాద్ కు యూనివర్సిటీ ఇస్తామని కేసీఆర్ చెప్పినా ఎందుకు ఇవ్వలేదు…? ఈ ప్రాంతానికి పదేళ్లలో ఒక్క యూనివర్సిటీ, ఇంజనీరింగ్ కాలేజ్ ఎందకు ఇవ్వలేదు..? సిర్పూర్ కాగజ్ నగర్ మిల్లు కోసం ప్రైవేట్ వ్యక్తులకు వెయ్యి కోట్లు ఇచ్చారు. కానీ కార్మికులకు మాత్రం ఏ మాత్రం మంచి చేయలేదు.. ఎందుకు..? పదేళ్లలో ఆదిలాబాద్ సిమెంట్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా, నిజామాబాద్ లో షుగర్ ఫ్యాక్టరీ ఎందుకు తెరిపించలేదు..? గోదావరి, ప్రాణహిత నదులు ఉన్నా ఎందుకు ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదు..? తుమ్మిడి హెట్టి కట్టి ఉంటే రెండున్నర లక్షల ఎకరాలకు నీళ్లు వచ్చేవి…. ఎందుకు కట్టలేదు…? చనఖా కొరటా ప్రాజెక్ట్ రూ. 368 కోట్లు ఉంటే దాన్ని వ్యయాన్ని ఏకంగా 2100 కోట్లకు ఎలా పెంచారు…? రా మెటీరియల్ ధర ఎంత పెరిగిన సరే ప్రాజెక్ట్ కాస్ట్ 2100 కోట్లకు పోతుందా..? అంటూ బీఆర్ఎస్పై ప్రశ్నల వర్షం కురిపించారు.
ఆదిలాబాద్ సీసీఐని మీరు కాపాడి ఉంటే ఇవ్వాళ పరిస్థితి వచ్చేది కాదంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు. సీసీఐ ని తెరిపించకుండా మోసం చేసిన పాపంలో బీఆర్ఎస్ మొదటి స్థానంలో ఉంటే కాంగ్రెస్ రెండో స్థానంలో, బీజేపీ మూడో స్థానంలో ఉంటుందని కవిత స్పష్టం చేశారు. మొత్తంగా జిల్లాలో ఏడున్నర లక్షల ఎకరాలకు నీళ్లు ఇవ్వాల్సి ఉన్న ఒక్క ఎకరాకు నీళ్లు ఇవ్వలేదన్నారు. సిద్దిపేట బాబు సభ పెట్టుకోని సిరిసిల్ల బాబు పిలవలేదంట. అందుకే సిరిసిల్ల బాబు ఆదిలాబాద్ గర్జనకు సిద్దిపేట బాబును పిలవటం లేదంటూ మరోమారు హరీష్‌రావు, కేటీఆర్‌పై సెటైర్లు వేశారు. సిరిసిల్ల, సిద్దిపేట బాబుల పంచాయితీలో ఆ పార్టీ కార్యకర్తలు ఆగమావుతున్నారని అన్నారు.