బిగ్ బ్రేకింగ్ – రిమ్స్ డైరెక్టర్ పై వేటు
రిమ్స్ డైరక్టర్ జై సింగ్ రాథోడ్ పై వేటు వేస్తూ ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. వరుస వివాదాల నేపథ్యంలో రిమ్స్ డైరక్టర్ పై బదిలీ వేటు వేశారు. ఈ మేరకు ఆయనను ఇక్కడ నుంచి బదిలీ చేస్తూ, నూతన డైరెక్టర్‌గా డాక్టర్ బలరాం చిట్కేను నియమిస్తూ తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
రిమ్స్‌లో వరుసగా చోటుచేసుకుంటున్న వివాదాల నేపథ్యంలో డైరెక్టర్ మార్పు ప్రాధాన్యత సంతరించుకుంది. ప్రభుత్వ ప్రిన్సిపల్ సెక్రటరీ డాక్టర్ క్రిస్టినా ఈ నియామకాలకు సంబంధించిన ఆదేశాలు జారీ చేశారు. ప్రస్తుతం సంగారెడ్డిలోని ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్లాస్టిక్ సర్జరీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న బలరాం చిట్కేకు ఈ బాధ్యతలు అప్పగించారు. డాక్టర్ జై సింగ్ రాథోడ్‌ను నాగర్‌కర్నూల్ వైద్య కళాశాల ఇన్‌చార్జి డైరెక్టర్‌గా బదిలీ చేశారు.
ఆదిలాబాద్ రిమ్స్‌లో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ ఆర్. జై సింగ్‌ను ఇన్‌చార్జి డైరెక్టర్ బాధ్యతల నుంచి రిలీవ్ చేస్తూ, నాగర్‌కర్నూల్ ప్రభుత్వ జనరల్ ఆసుపత్రి (జీజీహెచ్) సూపరింటెండెంట్‌గా నియమించింది. ఈ క్రమంలో ప్రస్తుతం ఆ బాధ్యతలు నిర్వహిస్తున్న డాక్టర్ సుప్రియను రిలీవ్ చేసింది. ఆమె నాగర్‌కర్నూల్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ప్రసూతి, స్త్రీ వ్యాధుల విభాగం (ఓబీజీ) ప్రొఫెసర్‌గా కొనసాగనున్నారు.
ఆదిలాబాద్ రిమ్స్ సూపరింటెండెంట్‌గా డాక్టర్ వెంకట్ లకావత్
ఆదిలాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో ఆర్థోపెడిక్స్ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ వెంకట్ లకావత్‌ను ఆదిలాబాద్ రిమ్స్ ఇన్‌చార్జి సూపరింటెండెంట్‌గా నియమించింది. ప్రస్తుతం ఆయన నిర్వహిస్తున్న కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్ బాధ్యతల నుంచి రిలీవ్ చేసింది.
కేబీ ఆసిఫాబాద్ వైద్య కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా డాక్టర్ జి. శ్రీలక్ష్మి
కుమురం భీం ఆసిఫాబాద్ ప్రభుత్వ వైద్య కళాశాలలో పాథాలజీ ప్రొఫెసర్‌గా పనిచేస్తున్న డాక్టర్ జి. శ్రీలక్ష్మిని ఆ కళాశాల ఇన్‌చార్జి ప్రిన్సిపల్‌గా నియమించింది. ఒకేసారి డైరెక్టర్, సూపరింటెండెంట్ స్థాయిలో మార్పులు చేయడం రిమ్స్‌లో చర్చనీయాంశంగా మారింది. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న అధికారులు ఆసుపత్రి పరిపాలన, వైద్య సేవలను ఏ విధంగా గాడిలో పెడతారన్నది ఆసక్తికరంగా మారింది.