జైలుకు వెళ్లాక కవితకు మతిభ్రమించింది..
-దమ్ముంటే హరీష్ రావు పై ఆరోపణలు నిరూపించు
-ప్రభుత్వాలతో జట్టుకట్టి బీఆర్ఎస్‌ను బద్‌నాం చేసే ప్రయత్నం
-అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కవిత మద్యం కేసే కారణం
-రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కవిత
-ఆరోపణలు నిరూపించకుంటే రియాజ్ ముక్కు భూమికి రాయిస్తాం
-కవితపై టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి ఫైర్
తెలంగాణ ఉద్యమకారుడు మాజీ మంత్రి తన్నీరు హరీష్ రావు పై చేసిన ఆరోపణలను దమ్ముంటే నిరూపించాలని దేవనపల్లి కవితను సవాల్ చేస్తున్నామని టీబీజీకేఎస్ రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ మాదాసి రామమూర్తి పేర్కొన్నారు. శుక్రవారం గోదావరిఖని టీబీజీకేఎస్ కేంద్ర కార్యాలయంలో జరిగిన యూనియన్ ముఖ్య కార్యకర్తల సమావేశంలో మాట్లాడారు. సింగరేణి సంస్థను కాపాడుకోవడానికి బీఆర్ఎస్, టీబీజీకేఎస్ కార్మిక సంఘం చేస్తున్న పోరాటాన్ని నీరుగార్చడానికి కవిత కుట్రపూరితంగా వ్యవహరిస్తున్నదని ఆయన ఆరోపించారు.
ప్రభుత్వాలతో జట్టు గట్టి బిఆర్ఎస్ పార్టీని బద్‌నాం చేయడానికి ప్రజల్లో చులకన చేయడానికి కవిత చేసిన ప్రయత్నాలు ఫలించవన్నారు. తీహార్ జైలుకు వెళ్లి వచ్చినప్పటి నుండి కవిత మతిభ్రమించి మాట్లాడుతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందులో భాగంగానే హరీష్ రావును వ్యక్తిగతంగా టార్గెట్ చేసి మాట్లాడుతున్నారని అన్నారు. సింగరేణి గనులలో ప్రమాదాలు జరిగి కార్మికులు మరణించినపుడు, అంగవైకల్యం పొందినప్పుడు బొగ్గు గనుల్లో మంటలు చెలరేగినప్పుడు కూడా కవిత బాధితులను పరామర్శించలేదన్నారు.
ఆడవాళ్లు కల్లు, బ్రాందీ అమ్మటాన్ని అసహ్యించుకున్నారని ఆ కేసులో జైలుకు వెళ్లడం వల్ల ప్రజల్లో తీవ్ర వ్యతిరేకత వచ్చిందన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి కవిత మద్యం కేసే కారణమని మాదాసు ఆరోపించారు. సింగరేణి లో టీబీజీకేఎస్ సంస్థకు చెడు పేరు రావడానికి, బీఆర్ఎస్ పార్టీ కోల్ బెల్ట్ ఏరియాలో ఓడిపోవడానికి కవిత ఆమె చేసిన అన్యాయాలేనని దుయ్యబట్టారు. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి వదిలిన బాణమే కవిత అనే విషయం తెలంగాణ సమాజం ఎన్నడో గుర్తించిందన్నారు. తెలంగాణ ఉద్యమ ప్రారంభం నుండి కేసీఆర్ వెంట నడిచిన ఉద్యమకారుడు మాజీ మంత్రి హరీష్ రావును విమర్శించడం కవిత తెలివి తక్కువ తనానికి నిదర్శనమన్నారు.
హెచ్ఎంఎస్ నాయకుడు రియాజ్ హరీష్ రావు పై బొగ్గు దొంగతనం ఆరోపణలు నిరూపించకుంటే గోదావరిఖని చౌరస్తాలో ముక్కు భూమికి రాయిస్తామని టీబీజీకేఎస్ రాష్ట్ర సీనియర్ ఉపాధ్యక్షుడు నూనె కొమరయ్య తీవ్రంగా హెచ్చరించారు. కేసీఆర్ ఓటమికి నీవు చేసిన పనులే కారణమంటూ కవితను హెచ్చరించారు. ఈ సమావేశంలో టీబీజీకేఎస్ అధికార ప్రతినిధి పర్లపల్లి రవి, కోశాధికారి చిలుకూరి సతీష్, కేంద్ర నాయకులు ఇందూరి సత్యనారాయణ, చిలుకలపల్లి శ్రీనివాస్, మదనపల్లి రాజేశం, అబ్దుల్ ఘనీ, దూట శేషగిరి, ఉప్పులేటి తిరుపతి, అప్సర్ పాషా, మీస రాజు, నూతి రాజ్ కుమార్, ప్రవీణ్ కుమార్, మాసాడి సాయి చరణ్, మల్లారెడ్డి దేవేందర్, నరేష్ పటేల్, సునీల్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.