రోడ్డుకు అడ్డంగా ఐదు పులులు
-మహారాష్ట్రలో ఒకేసారి ప్రత్యక్షమైన ఐదు పులులు
-చంద్రపూర్ జిల్లా చిమూర్ తాలూకాలో ఘటన
-మాసల్ - పఠ్సగావ్ మార్గంలో రోడ్డుకు అడ్డంగా పులులు
-నెట్టింట వైరల్గా మారిన పులుల వీడియో
-ప్రయాణికులు అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరిక
ఒక పులి కనిపిస్తేనే ప్రాణాలు గుప్పెట్లో పెట్టుకుంటాం… అలాంటిది ఏకంగా ఐదు పులులు ఒకేసారి రోడ్డుపైకి వస్తే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. మహారాష్ట్రలో సరిగ్గా ఇదే జరిగింది. రోడ్డుకు అడ్డంగా ఒకేసారి ఐదు పులులు దర్జాగా పచార్లు చేస్తున్న దృశ్యాలు ఇప్పుడు సంచలనంగా మారాయి. పూర్తి వివరాలు చూద్దాం…
మహారాష్ట్రలోని చంద్రపూర్ జిల్లాలో ప్రయాణికులకు అనూహ్య అనుభవం ఎదురైంది. చిమూర్ తాలూకా పరిధిలోని మాసల్ – పఠ్సగావ్ మార్గంలో కలజీల్ రిసార్ట్ సమీపంలో ఒకేసారి ఐదు పులులు ప్రత్యక్షమయ్యాయి. అడవిని దాటుకుంటూ వచ్చిన ఈ వ్యాఘ్రాలు… ఇలా దర్జాగా రోడ్డుకు అడ్డంగా బైఠాయించాయి. ఒకేచోట ఏకంగా ఐదు పులులు కనిపించడంతో ఆ మార్గంలో వెళ్తున్న ప్రయాణికులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు.
వాహనదారులు తమ సెల్ ఫోన్లలో బంధించిన ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతోంది. అయితే, ఒకేచోట ఇన్ని పులులు సంచరిస్తుండటంతో స్థానికంగా తీవ్ర భయాందోళనలు వ్యక్తమవుతున్నాయి. ఈ ఘటనపై అటవీశాఖ అధికారులు అప్రమత్తమయ్యారు. ఆ మార్గంలో వెళ్లే ప్రయాణికులు, చుట్టుపక్కల గ్రామాల ప్రజలు అత్యంత జాగ్రత్తగా ఉండాలని సూచిస్తున్నారు. పులుల దగ్గరికి వెళ్లే ప్రయత్నం గానీ, ఫొటోల కోసం వాటిని ఇబ్బంది పెట్టడం గానీ చేయవద్దని అధికారులు తీవ్రంగా హెచ్చరిస్తున్నారు.