ఒక్క రూపాయికి పదిస్తాం
డబ్బులకు ఆశపడే అమాయక ప్రజలే టార్గెట్‌గా అంతర్రాష్ట్ర ముఠా మోసాలకు తెరలేపింది. మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులను రెట్టింపు చేస్తామంటూ నమ్మించి లక్షలాది రూపాయలు కాజేస్తోంది. ఒక రూపాయి నోటును పది రూపాయలుగా మార్చగలమంటూ మాయమాటలు చెప్పి బాధితుల నుంచి నగదు వసూలు చేస్తోంది. ఇలా రాష్ట్రవ్యాప్తంగా 24 మందిని మోసం చేసిన ముఠా గుట్టును ఆదిలాబాద్ జిల్లా ఇచ్చోడ పోలీసులు రట్టు చేశారు. ఐదుగురు నిందితులను అరెస్టు చేసి, నగదుతో పాటు మూడు కార్లు, సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మంత్రతంత్రాలు.. పూజలు.. డబ్బులు రెట్టింపు చేస్తామంటూ మాయమాటలు.. ఇదీ అంతర్రాష్ట్ర ముఠా మోసాల తీరు. అమాయక ప్రజలకు అధిక మొత్తంలో డబ్బులు వస్తాయనే ఆశ చూపించి లక్షలాది రూపాయలు దోచుకుంటున్న ఐదుగురు సభ్యుల ముఠాను ఇచ్చోడ పోలీసులు అరెస్టు చేశారు.
ఈ నెల 19వ తేదీన ఇచ్చోడ పోలీస్ స్టేషన్ పరిధిలోని జాతీయ రహదారి 44 సమీపంలో ఈ ముఠా మరో మోసానికి పాల్పడింది. ఒక రూపాయి నోటును పది రూపాయలుగా మార్చగలమని నమ్మించిన నిందితులు.. తోకల రాజు అనే బాధితుడి నుంచి మూడు లక్షల రూపాయలు తీసుకున్నారు. ఇచ్చోడలోని టీజీడబ్ల్యూఆర్‌జేసీ పాఠశాల సమీపంలోని అండర్ బ్రిడ్జి వద్దకు నగదుతో రావాలని చెప్పడంతో.. రాజు తన పరిచయస్తుడు శ్రీపతి శంకర్‌తో కలిసి అక్కడికి చేరుకున్నాడు.
అయితే డబ్బులు చూపిస్తున్న సమయంలో నిందితులు ఒక్కసారిగా నగదును బలవంతంగా లాక్కొని, బాధితులపై దాడి చేసి కారులో పరారయ్యారు. ఈ క్రమంలో బాధితుడు ఒక నిందితుడి ఫొటోను తన సెల్ఫోన్లో చిత్రీకరించడంతో పోలీసుల దర్యాప్తుకు కీలక ఆధారం లభించింది.
ఈ ముఠా మోసాల తీరు కూడా చాలా విచిత్రంగా ఉంది. ముందుగా తమకు మంత్రశక్తులు ఉన్నాయని, పూజల ద్వారా డబ్బులను రెండింతలు లేదా నాలుగింతలు చేస్తామని బాధితులను నమ్మించేవారు. పూజల సమయంలో అసలు నగదు ఉన్న బ్యాగులను తెల్ల కాగితాలు లేదా బొమ్మ నోట్లతో నింపిన బ్యాగులతో మార్చేసేవారు. ఐదు నుంచి పది రోజుల వరకు బ్యాగులు తెరవకూడదని చెప్పి అక్కడి నుంచి వెళ్లిపోయేవారు. బాధితులు నిలదీస్తే పూజ విఫలమైందని, మరోసారి పూజ చేయాలని చెప్పి మరింత డబ్బు వసూలు చేసేందుకు ప్రయత్నించేవారు.
ఈ ముఠా గతంలో మంచిర్యాల, కరీంనగర్, పెద్దపల్లి, నిజామాబాద్, ఆసిఫాబాద్, కామారెడ్డి తదితర జిల్లాల్లోనూ మోసాలకు పాల్పడినట్లు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఆదిలాబాద్ జిల్లాలోనే ఇచ్చోడ, ఉట్నూర్, ఇంద్రవెల్లి పోలీస్ స్టేషన్ల పరిధిలో మొత్తం ఎనిమిది కేసులు నమోదయ్యాయి. వీటిలో పది మంది బాధితులు ఉన్నట్లు గుర్తించారు. రాష్ట్రవ్యాప్తంగా 24 మందిని మోసం చేసినట్లు పోలీసులు వెల్లడించారు.
మోసాల ద్వారా సంపాదించిన డబ్బులను నిందితులు సమానంగా పంచుకొని జల్సాలకు, కారు ఈఎంఐల చెల్లింపులకు, ఇళ్ల నిర్మాణాలకు వినియోగించినట్లు విచారణలో తేలింది.
ఈ కేసులో ఆత్రం పరశురాం, మండలి బక్కన్న, నౌగడే శేఖర్, మండలి శైలేష్, షేక్ అలీంలను పోలీసులు అరెస్టు చేశారు. వారి వద్ద నుంచి 3 లక్షల 74 వేల రూపాయల నగదు, మూడు కార్లు, నాలుగు సెల్ఫోన్లను స్వాధీనం చేసుకున్నారు.
మంత్రతంత్రాలు, పూజల పేరుతో డబ్బులు రెట్టింపు చేస్తామని చెప్పే వ్యక్తులను నమ్మవద్దని, అత్యాశకు పోయి కష్టపడి సంపాదించిన డబ్బులను పోగొట్టుకోవద్దని ఎస్పీఅఖిల్ మహాజన్ ప్రజలకు సూచించారు. ఇలాంటి మోసాలు ఎదురైతే వెంటనే పోలీసులకు సమాచారం అందించాలని కోరారు.
మొత్తానికి డబ్బులు రెట్టింపు అవుతాయనే అత్యాశే మోసగాళ్లకు పెట్టుబడిగా మారుతోంది. మంత్రతంత్రాలు, పూజలతో డబ్బులు పెంచడం సాధ్యం కాదనే విషయాన్ని ప్రజలు గుర్తించాల్సిన అవసరం ఉంది. అపరిచిత వ్యక్తుల మాటలు నమ్మి కష్టార్జితాన్ని వారి చేతుల్లో పెట్టకుండా అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచిస్తున్నారు.