చైనా నుంచి బంగ్లాదేశ్‌కు రహస్య నౌక
మిస్సైల్ సామగ్రితో వెళ్తున్న నౌకను సీజ్ చేసిన ఇండోనేసియా నేవీ
చైనా నుంచి బంగ్లాదేశ్‌లోని మోంగ్లా ఓడరేవుకు 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ను తీసుకెళ్తున్న ఓ నౌకను ఇండోనేసియా సీజ్ చేసింది. రాకెట్, మిస్సైళ్ల తయారీకి సోడియం పెర్క్లోరేట్ను ఉపయోగిస్తారు. అయితే బంగ్లాదేశ్‌లో చిన్న చిన్న ఆయుధాలను తయారు చేసే సైనిక పరిశ్రమలే ఉన్నాయి. మిస్సైళ్లను తయారు చేసే సామర్థ్యం ఆ దేశానికి లేదు. అలాంటప్పుడు ఏకంగా 100 మిస్సైళ్ల తయారీకి సరిపోయే ఆక్సిడైజేషన్ ఏజెంట్‌ను బంగ్లాదేశ్‌కు ఎందుకు తీసుకెళ్తున్నారనే అనుమానాలు తలెత్తుతున్నాయి.
షేక్ హసీనాను గద్దె దించిన తర్వాత బంగ్లాదేశ్‌లో భారత్ పట్ల వ్యతిరేకత పెరిగిపోయిన సంగతి తెలిసిందే. ఈ పరిస్థితి తనకు అనుకూలంగా మలుచుకోవాలని భావిస్తోన్న చైనా.. బంగ్లాను తనవైపు తిప్పుకోవడానికి ప్రయత్నిస్తోంది. దీంతో దక్షిణాసియాలో భారత్ ప్రాబల్యం తగ్గించడంతోపాటు.. హిందూ మహాసముద్రంలో తన పట్టు పెంచుకోవచ్చని చైనా భావిస్తోంది. అందుకే మోంగ్లా పోర్టు ఆధునికీకరణకు పెట్టుబడులు పెట్టడంతోపాటు.. తీస్తా నది ప్రాజెక్ట్‌కు సాంకేతిక, ఆర్థిక సాయం అందించడానికి సైతం డ్రాగన్ ముందుకొచ్చింది. బంగ్లాదేశ్‌కు అతిపెద్ద ఆయుధ సరఫరాదారుగా ఉన్న చైనా.. వాణిజ్య రాయితీలు ప్రకటిస్తూ మెల్లమెల్లగా ఢాకాను తనవైపు తిప్పుకుంటోంది.
ఈ క్రమంలోనే చైనా నుంచి బంగ్లాదేశ్ వైపు వెళ్తున్న ఓ భారీ కార్గో నౌకను ఇండోనేసియా నేవీ అధికారులు సీజ్ చేయడం ఆసక్తికరంగా మారింది. ఇందులో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ ఉంది. శక్తివంతమైన ఈ ఆక్సిడేటింగ్ కెమికల్‌ను రాకెట్లు, మిస్సైల్ ప్రొపెలంట్స్లో ఉపయోగిస్తారు. ఈ రసాయనంతోపాటు లక్షలాది రిజిస్టర్ కాని ఖాళీ సిమ్ కార్డులను కూడా ఆ నౌకలో గుర్తించారు.
సీజ్ చేసిన సోడియం పెర్క్లోరేట్తో 100 మిస్సైళ్లు తయారు చేయొచ్చని ఇండోనేసియా నేవీ కమాండర్ ఒకరు తెలిపారు. దీంతో ఇంత పెద్ద మొత్తంలో ఈ సరకును తరలించడం వెనుక ఉద్దేశం ఏంటి..? బంగ్లాదేశ్‌లో దీన్ని ఎవరు తీసుకోవాల్సి ఉందనే విషయమై ప్రశ్నలు తలెత్తుతున్నాయి. కొమొరోస్ జెండాతో ఉన్న ఎంవీ స్టార్ లైన్స్ అనే నౌక చైనాలోని లియాన్యుంగాంగ్ పోర్టు నుంచి బంగ్లాదేశ్‌లోని మొంగ్లా పోర్టుకు వస్తుండగా.. సుమిత్రాలోని బెలవాన్ తీరానికి సమీపంలో, ఇండోనేసియా జలాల్లో నవంబర్ 7న దాన్ని అడ్డుకున్నారని ఢాకా కేంద్రంగా ప్రచురితమయ్యే ‘ది బిజినెస్ స్టాండర్డ్’ పత్రిక వెల్లడించింది.
అయితే ఆ నౌక కదలికలు సాధారణం కంటే భిన్నంగా ఉన్నాయని గస్తీ నౌక కేఆర్ఐ సిగలు-857 రాడార్ గుర్తించింది. రేడియో కమ్యూనికేషన్స్‌కు కూడా రెస్పాండ్ కాకపోవడంతో ఇండోనేసియా నేవీ సిబ్బంది ఆ నౌకను అడ్డగించి తనిఖీలు చేపట్టారు. నౌకలో 36 కంటెయినర్లు ఉండగా.. అందులో 15 కంటెయినర్లలో 405 టన్నుల సోడియం పెర్క్లోరేట్ను రవాణా చేస్తున్నట్లు ఈ తనిఖీల్లో తేలింది. అలాగే 54 ప్యాలెట్లలో మిలియన్ల కొద్దీ రిజిస్టర్ అవ్వని ఖాళీ 4జీ ఎల్టీఈ సిమ్ కార్డులను కూడా గుర్తించారని ది బిజినెస్ స్టాండర్డ్ తెలిపింది. ప్రయాణ సమయంలో ఆటోమెటిక్ ఐడెంటిఫికేషన్ సిస్టమ్ ఆ నౌక స్విచ్ఛాఫ్ చేసి ఉండొచ్చని ఇండోనేసియా నేవీ అనుమానిస్తోంది.
ఈ ఎంవీ స్టార్ లైన్ నౌక వెళ్లే మోంగ్లా పోర్టు బంగ్లాదేశ్‌లో ఛత్తోగ్రామ్ తర్వాత రెండో అతిపెద్ద నౌకాశ్రయం. ఈశాన్య రాష్ట్రాలకు/నుంచి సరకు రవాణా కోసం మోంగ్లా, ఛత్తోగ్రామ్ పోర్టులను వాడుకోవడానికి కొన్నేళ్ల కిందట బంగ్లాదేశ్‌తో భారత్ ఒప్పందం చేసుకుంది. మోంగ్లా నౌకాశ్రయంతో అనుసంధానాన్ని మెరుగుపర్చడం కోసం ఖుల్నా-మొంగ్లా రైల్వే లైన్‌కు భారత్ ఆర్థిక సాయం చేసింది. చైనా సైతం ఈ ఓడరేవు చుట్టూ తన ఆర్థిక కార్యకలాపాలను విస్తరిస్తోంది. మోంగ్లా సమీపంలోని 110 ఎకరాల్లో సెజ్ (స్పెషల్ ఎకనమిక్ జోన్)ను డెవలప్ చేయడానికి ఈ ఏడాది జూన్‌లోనే చైనా బంగ్లాదేశ్‌తో ఒప్పందం చేసుకుంది.
మొత్తంగా మోంగ్లా పోర్టు చుట్టూ భారత్, చైనా తమ వ్యూహాత్మక ప్రయోజనాలను విస్తరించుకునేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో.. క్షిపణుల తయారీలో ఉపయోగించే 405 టన్నుల రసాయనంతో వెళ్తున్న నౌకను ఇండోనేసియా అడ్డుకోవడం ప్రాధాన్యం సంతరించుకుంది. ఈ రసాయనం తరలింపు వెనుక అసలు ఉద్దేశం ఏమిటి? బంగ్లాదేశ్‌లో దీన్ని స్వీకరించాల్సిన సంస్థ ఏది? అనే ప్రశ్నలకు సంబంధించి పూర్తి వివరాలు వెలుగులోకి రావాల్సి ఉంది.