గంజా గస్తీలో ఎస్పీ..

మాదకద్రవ్యాల నిర్మూలన లక్ష్యంగా నిర్వహిస్తున్న గంజా గస్తీ కార్యక్రమంలో నిర్మల్, భైంసా పట్టణాల్లో నిర్మ‌ల్ ఎస్పీ డాక్ట‌ర్‌ జానకి షర్మిల పాల్గొన్నారు. ఆమె క్షేత్రస్థాయి తనిఖీలు నిర్వ‌హించ‌డ‌మే కాకుండా, విద్యాసంస్థల సమీపంలోని దుకాణదారులకు అధికారుల ద్వారా నోటీసులు జారీ చేయించారు.

ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ.. విద్యార్థులు, యువత మాదకద్రవ్యాలు, పొగాకు ఉత్పత్తుల బారిన పడకుండా కాపాడటం ప్రతి ఒక్కరి బాధ్యతన్నారు. దుకాణదారులు చట్ట నిబంధనలను తప్పనిసరిగా పాటించాలని, తల్లిదండ్రులు, విద్యాసంస్థల యాజమాన్యాలు, వ్యాపారులు మాదకద్రవ్యాల నిర్మూలనలో పోలీసులకు సహకరించాలని కోరారు. జిల్లాలో గంజాయి సాగు, విక్రయాలు, అక్రమ రవాణా సమాచారం తెలిస్తే వెంటనే పోలీసులకు చెప్పాల‌ని విజ్ఞప్తి చేశారు. యువత భవిష్యత్తును కాపాడుతూ నిర్మల్ జిల్లాను మాదకద్రవ్యాల రహిత జిల్లాగా తీర్చిదిద్దేందుకు పోలీస్ శాఖ నిరంతరం కృషి చేస్తోంద‌న్నారు.

18 సంవత్సరాల లోపు వారికి పొగాకు ఉత్పత్తులు విక్రయించవ‌ద్ద‌న్నారు. విద్యాసంస్థలకు 100 గజాల పరిధిలో పొగాకు ఉత్పత్తుల విక్రయాలు నిషేధమన్నారు.నిర్మల్ పట్టణంలో డీఎస్పీ శ్రీనివాస్, టౌన్ సీఐ సమ్మయ్య, భైంసా పట్టణంలో సీఐ సాయికుమార్, సీఐ ప్రవీణ్, సీఐ రవీందర్ నాయక్, దీపక్ ఎస్ఐ పాల్గొన్నారు.

You might also like