కన్నపేగు కాదనుకుంది.. ఊరు సాగనంపింది…
“డబ్బు, స్వార్థం ముందు రక్త సంబంధాలు చిన్నబోతున్నాయా..? నవమాసాలు మోసి, కనిపెంచిన తల్లి ప్రాణం వదిలితే.. కడచూపునకు కూడా రాలేనంతగా బిడ్డల మనసులు బండబారిపోయాయా..? అవును, ఈ రోజుల్లో బంధాలు, బాంధవ్యాలు ఎంతలా మంటగలిసిపోతున్నాయో చెప్పే ఓ హృదయ విదారక ఘటనే ఇది. బిడ్డలున్నా ఆ తల్లికి అనాథ శవంగా మారే పరిస్థితి రాగా… తోటి మనుషులుగా గ్రామస్తులే మానవత్వాన్ని చాటుకున్నారు…”
నవ మాసాలు మోసి కనిపెంచిన తల్లిని కడసారి చూసేందుకు ఆ కొడుకు రాలేదు.. కడచూపునకు వచ్చిన కూతుళ్లు సైతం తలకొరివి పెట్టలేదు. కన్నబిడ్డలున్నా ఆ తల్లి చివరి మజిలీ అనాథగా ముగిసింది. రక్త సంబంధాలు మంటగలిసినా.. తోటి మనుషులుగా గ్రామస్తులే మానవత్వాన్ని చాటుకుంటూ ఆమెకు అంతిమ సంస్కారాలు నిర్వహించారు. కంటతడి పెట్టిస్తున్న ఈ హృదయ విదారక ఘటన జనగామ జిల్లాలో చోటుచేసుకుంది.
జనగామ జిల్లా తరిగొప్పుల మండల కేంద్రంలో ఈ విషాద ఘటన చోటుచేసుకుంది. గ్రామానికి చెందిన నాగబండి రామచంద్రం, పుష్పనీల దంపతులకు ఒక కుమారుడు, ఐదుగురు కుమార్తెలు. వీరిలో రెండో కూతురు, అలాగే భర్త రామచంద్రం గతంలోనే మృతి చెందారు. కాగా, వృద్ధాప్యంలో ఉన్న పుష్పనీల సోమవారం కన్నుమూశారు. తల్లి మరణవార్తను హైదరాబాద్ లో ఉంటున్న ఆమె కొడుకుకు గ్రామస్తులు ఫోన్ ద్వారా సమాచారం ఇవ్వగా.. తాను రాలేనని నిర్మొహమాటంగా తేల్చి చెప్పాడు. కనీసం ఇద్దరు కూతుళ్లు అక్కడికి చేరుకున్నప్పటికీ.. తల్లికి తలకొరివి పెట్టేందుకు ససేమిరా అన్నారు.
కన్నబిడ్డలున్నా వాళ్లు చేసిన పనికి గ్రామస్తులు చలించిపోయారు. చివరి మజిలీలో అక్కరకు రాకుండాపోయిన ఆ బిడ్డలను చూసి ఆవేదన వ్యక్తం చేశారు. ఇక ఆ తల్లి మృతదేహానికి గ్రామ పంచాయతీ సిబ్బంది, ఆర్యవైశ్య కులస్తులు, గ్రామస్తులే ఏకమై పాడె మోశారు. వారే స్వయంగా తలకొరివి పెట్టి అంతిమ సంస్కారాలు పూర్తి చేశారు. కన్నవారు కాదనుకున్నా.. ఓ తల్లికి కన్నీటి వీడ్కోలు పలికి సాగనంపిన గ్రామస్తుల మానవత్వం ఇప్పుడు స్థానికంగా అందరినీ కంటతడి పెట్టిస్తోంది. ప్రస్తుత సమాజంలో మానవ సంబంధాలు ఎంతలా దిగజారిపోయాయో చెప్పేందుకు ఈ ఘటనే నిదర్శనం అని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.
“ఇదీ ఆ తల్లి విషాద గాథ. బతికున్నప్పుడు ఆప్యాయంగా పలకరించకపోగా… కనీసం చివరి మజిలీలో ఆ తల్లి రుణం తీర్చుకునేందుకు కూడా కన్నవాళ్లు రాకపోవడం యావత్ సమాజం సిగ్గుపడేలా చేస్తోంది. ఏ రక్త సంబంధం అయితే తప్పుకుందో.. అదే చోట అనామకులుగా ఉన్న గ్రామస్తులు, పంచాయతీ సిబ్బంది పాడె మోసి మానవత్వం ఇంకా బతికే ఉందని నిరూపించారు. బంధాల కంటే.. సాటి మనిషిగా చూపే జాలి, ప్రేమే గొప్పవని ఈ ఘటన చాటిచెబుతోంది”.