ప్రాణ స్నేహితుడే ప్రాణం తీశాడు
ఆదివారం అర్ధరాత్రి జరిగిన అట్ల రాజశేఖర్ దారుణ హత్య కేసును పోలీసులు కేవలం 12 గంటల్లోనే ఛేదించారు. ఈ హత్యకు పాత కక్షలు, వ్యక్తిగత విభేదాలే కారణమని నిర్ధారించారు. కట్టుదిట్టమైన ఆధారాలతో నలుగురు నిందితులను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు.
గోదావరిఖని పవర్ హౌస్ కాలనీ శివాలయం సమీపంలో 23వ తేదీ అర్ధరాత్రి అట్ల రాజశేఖర్ అనే యువకుడిని దుండగులు దారుణంగా నరికి చంపారు. మృతుడి తండ్రి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన వన్ టౌన్ పోలీసులు.. రామగుండం సీపీ, పెద్దపల్లి డీసీపీ రామ్ రెడ్డి ఆదేశాలతో ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేశారు. ఫైవ్ ఇంక్లైన్ చౌరస్తా వద్ద ఆటోలో కాల్వ శ్రీరాంపూర్ వైపు పారిపోతున్న నలుగురు నిందితులను చాకచక్యంగా పట్టుకున్నారు.
పోలీసుల విచారణలో విస్తుపోయే నిజాలు వెలుగుచూశాయి. ప్రధాన నిందితుడైన ఆటో డ్రైవర్ ఎన్నం ప్రసాద్, మృతుడు రాజశేఖర్ ఒకప్పుడు ప్రాణ స్నేహితులు. అయితే గత ఆరు నెలలుగా వీరి మధ్య తీవ్ర విభేదాలు తలెత్తాయి. ఫోన్లో పదే పదే వాగ్వాదానికి దిగడం, కుటుంబ సభ్యులను దుర్భాషలాడుకోవడంతో ప్రసాద్.. రాజశేఖర్ పై తీవ్ర కక్ష పెంచుకున్నాడు. తన స్నేహితులైన ఎడ్లపల్లి శ్రావణ్, అయిలీ దేవేందర్, బోరె మల్లేష్ లతో కలిసి పక్కా స్కెచ్ వేశాడు. ముందుగానే కత్తులు కొనుగోలు చేసి.. రాజశేఖర్ ఇంటికి వెళ్లే దారిలో మాటువేశారు. అదును చూసి అతడిపై కత్తులతో మూకుమ్మడి దాడి చేసి కిరాతకంగా హతమార్చారు. ఆధారాలు మాయం చేసేందుకు రక్తపు మరకలున్న దుస్తులను కాల్చేసి, ఆ బూడిదను గోదావరిలో కలిపినట్లు పోలీసులు గుర్తించారు.
నిందితుల నుంచి నేరానికి ఉపయోగించిన ఆటో, రెండు కత్తులు, మూడు సెల్ ఫోన్లు, రక్తపు మరకలున్న ఒక టీషర్ట్ ను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు. వేగంగా స్పందించి కేసును ఛేదించిన సీఐ లింగమూర్తి, ఎస్సైలు మనోహర్, రాజశేఖర్ ఇతర సిబ్బందిని ఉన్నతాధికారులు అభినందించారు.
ఈ సందర్బంగా డీసీపీ రాంరెడ్డి మాట్లాడుతూ “రౌడీషీటర్లు, అసాంఘిక శక్తులు శాంతిభద్రతలకు విఘాతం కలిగిస్తే ఎంతటి వారైనా ఉపేక్షించేది లేదన్నారు. చట్టాన్ని ఉల్లంఘించే వారిపై ఉక్కుపాదం మోపుతామని హెచ్చరించారు. నేరస్తులు ఎంత పక్కా ప్రణాళికతో వ్యవహరించినా పోలీసుల కళ్లుగప్పి తప్పించుకోలేరన్నారు. ప్రజలు వ్యక్తిగత కక్షలను హింసాత్మకంగా కాకుండా చట్టపరంగా పరిష్కరించుకోవాలని సూచించారు
నిందితులను పట్టుకోవడంలో చాకచక్యంగా వ్యవహరించిన సీఐ లింగమూర్తి ఎస్సై మనోహర్ రాజశేఖర్, హెడ్ కానిస్టేబుల్ సదయ్య, కానిస్టేబుల్ బి. ప్రకాష్, ఐ రమేష్,మధుకర్, మధుసూదన్ లను డిసిపి ఏసిపి అభినందించారు.